Praja Bhavan | హైదరాబాద్ : ప్రజా భవన్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని సామాన్య జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నేమో ప్రజా దర్బార్‌కు ప్రజలు రావొచ్చని చెప్పి.. ఇవాళ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని జనాలు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజా ప్రభుత్వం.. ప్రజా పాలన అని విమర్శలు గుప్పించారు. కనీసం ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు అంటూ దుమ్మెత్తిపోశారు. 1500 మందిని హ్యాండిల్ చేయకపోతే ఎట్ల..? అని నిలదీశారు. స్టేజ్ మాదే.. మైక్ మాదే.. అని ఊదరగొట్టారు.. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు అని మహిళలు దుమ్మెత్తిపోశారు.
ప్రజా దర్బార్‌కు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారి ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఒకరిద్దరు మహిళలు ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. అధికారంలోకి రాగానే అది సాల్వ్ చేస్తం.. ఇది సాల్వ్ చేస్తమని ఇష్టమొచ్చినట్లు చెప్తరు. సమస్యలు చెప్పుకుందామని వస్తే అడ్డుకుంటరు. స్టేజ్ మాదే.. మైక్ మాదే అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతరు. అందరికీ మేమున్నం.. అని ఈడికి పిలిపించుకుని అడ్డుకుంటున్నరు. ఎమర్జెన్సీ కేసు అంటే కూడా పంపిస్తలేరు అని ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చింది.
ప్రజల కోసం హానెస్ట్‌గా వచ్చిన పార్టీ అయితే.. రోజుకు ఇంత మందికి అవకాశం కల్పిస్తామని చెప్పాలి. ఒక డేట్, టైమ్‌ను ఫిక్స్ చేయాలి. ఎమ్మెల్యేల ద్వారా ఇన్ఫాం చేయమని చెప్పండి. ఏదో నోటికి వచ్చిందని.. మీరు వచ్చేయండి అని చెప్తే.. ఇలా జనాలు పిచ్చోళ్లు అయి రోడ్ల మీద వచ్చి కూర్చుంటారు. అందరూ కలిసి చెప్పులు మెడకేస్తరు అని మరో మహిళ ధ్వజమెత్తింది.
మరో వ్యక్తి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా దర్బార్‌కు వచ్చిన 1500 మందిని హ్యాండిల్ చేయకపోతే ఎట్ల? అని ప్రభుత్వాన్ని నిలదీశాడు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నరు. అందర్నీ రమ్మని చెప్పారు. అందరూ వచ్చిండ్రు. కనీసం వెయ్యి, 1500 మందిని హ్యాండిల్ చేయాలి కదా..? 1500 మందికి కనీసం మీరు ఫెసిలిటిస్ కల్పించలేరా..? మా అభ్యర్థనలను స్వీకరించేందుకు ఎందుకు ఇబ్బంది..? కాలనీలో సమస్యలు ఉన్నాయి.. చెప్పుకుందామని వచ్చాం.. ఒక కాగితం తీసుకుంటే ఎంత బాగుంటది సర్.. ఇలా అడ్డుకోవడం తమకు బాధ అనిపిస్తుంది అని సదరు వ్యక్తి పేర్కొన్నాడు.
ఇనుప కంచెలు పోయి బారికెడ్లు వచ్చాయి
ప్రజా భవన్ లోపలికి పంపట్లేదు అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.
ప్రజా దర్బార్ వదిలేసి ఢిల్లీ వెళ్లిపోయిన సీఎం రేవంత్ రెడ్డి గారు. pic.twitter.com/3ESG7jieC2
— Telugu Scribe (@TeluguScribe) December 8, 2023