హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించినట్లు పలు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ వార్తలను నమ్మి తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కానీ ఆ వార్తలు వాస్తవం కావు.
అయితే రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి వైరల్ చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం శ్రీనివాస్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఇది ఐదు రెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని, ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్న యూకే, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా, ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఆమెను తక్షణమే గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి పరీక్షలు నిర్వహించామని శ్రీనివాస్ రావు తెలిపారు. నమూనాలను సేకరించి జన్యుపరీక్షల కోసం పంపినట్లు పేర్కొన్నారు. అది ఒమిక్రాన్ వేరియంటా? కాదా? అనేది ఒకటి రెండు రోజుల్లో తేలుతుంది అని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియాలో మాత్రం తప్పుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తప్పుడు వార్తలు సృష్టించి, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఫేక్ వార్తలపై తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ కూడా స్పందించారు. ఒక కొవిడ్ పేషెంట్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నదో లేదో తెలుసుకోవడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. దాని కోసం రెండు వారాల దాకా సమయం పట్టొచ్చు. కనుక ఇవాళ ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది అని కొందరు ఫార్వర్డ్ చేస్తున్న మెసేజులు ఫేక్. ఇటువంటి ఫేక్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి! అని కొణతం దిలీప్ ట్వీట్ చేశారు.
#TrustButVerify
— Konatham Dileep (@KonathamDileep) December 2, 2021
As far as I understood, to confirm if it's a positive case of #OmicronVariant or not, genetic analysis is needed & it can take up to a couple of weeks. Some ppl are spreading fake messages that Omicron case detected in a passenger who landed in Hyd today!
ఇక దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులను పరిశీలిస్తే.. కర్ణాటకలో తొలిసారిగా రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 66, 46 ఏళ్లు ఉన్న ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది అని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.