Liquer Sales | హైదరాబాద్ , జూలై 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఖజానాను నింపుకోవడానికి రాష్ట్ర ప్రజలను మత్తులో ముంచుతున్నది. మద్యం అమ్మకాల ద్వారా గత ఏడాది కన్నా రూ.11 వేల కోట్లు అధికంగా.. ఈ ఏడాది రూ.45 వేల కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ సర్కార్.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. ఇందుకు తాజాగా కాగ్ వెల్లడించిన గణాంకాలు అద్దం పడుతున్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి నెల ఏప్రిల్‌లో రాష్ర్టానికి మద్యం అమ్మకాల ద్వారా రూ.1,580 కోట్లు, మేలో రూ.3,321 కోట్లు వచ్చినట్టు కాగ్ రిపోర్టు వెల్లడించింది. జూన్‌లో రూ.1,342 కోట్ల ఆదాయం వచ్చినట్టు సమాచారం. మద్యం అమ్మకాల నుంచి ఎక్సైజ్‌శాఖకు ప్రతినెలా సుమారు రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం వస్తున్నది. ఆరు నెలల్లోనే రూ.23 వేల కోట్లు ఆదాయం సమకూరినట్టు తెలిసింది.
దావత్లో లిక్కర్‌పై ఎక్సైజ్ నజర్
దావత్‌లలో ‘సిట్టింగ్’ వేయాలంటే ఇక తప్పనిసరిగా ఎక్సైజ్‌శాఖ అనుమతి తీసుకోవాల్సిందే! అక్కడ ఏదైనా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్) కనిపిస్తే ఉపేక్షించేది లేదని ఎక్సైజ్‌శాఖ ఎన్ఫోర్స్మెంట్ విభాగం హెచ్చరించింది. విదేశాల నుంచో, ఇతర రాష్ర్టాల నుంచో మద్యం అక్రమంగా తెచ్చి ఫంక్షన్లు చేసినా, ప్రైవేట్ పార్టీలు పెట్టుకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు పెరుగుతుండడంతో ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడ ఫంక్షన్లు, పార్టీలు జరిగినా అక్కడ ‘సిట్టింగ్’ ఆప్షన్ ఉంటే తప్పనిసరిగా మఫ్టీలో నిఘా పెట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, 100 నుంచి 200 మంది ఆపై హాజరయ్యే ప్రతి ఫంక్షన్లోనూ తప్పనిసరిగా నిఘా పెట్టాలని సూచించారు.
ఫంక్షన్లలో మద్యం సిట్టింగ్ కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఎక్కన్నుంచో మద్యం దొంగచాటుగా తీసుకొస్తే ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఏడు ఏప్రిల్ వరకు 302 కేసులు న మోదు చేశాం. 165 మందిని అదుపులోకి తీసుకున్నాం. 35 వాహనా లు సీజ్ చేసి, 61.13 లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశాం. ఇకనుంచి స్పెషల్ డ్రైవ్‌లపై దృష్టిపెట్టాలి. లేకపోతే అధికారులపై చర్యలు తప్పవు.
– వీబీ కమలాసన్‌రెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్