హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ డ్యామ్ పర్యవేక్షణకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీని కోరారు. ఈ మేరకు తాజాగా బోర్డుకు లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అర్ధరాత్రి వేళ అప్రజాస్వామికంగా ఏపీ సర్కార్.. నాగార్జునసాగర్ డ్యామ్‌పైకి సాయుధబలగాలతో తరలివచ్చి కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్లను ఆక్రమించడం, ఆ తర్వాత కేంద్ర జల్‌శక్తి శాఖ జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. కేఆర్ఎంబీ ఆదేశాలు లేనిదే ఎవరినీ డ్యామ్‌పైకి రానివ్వకూడదంటూ బలగాలకు కేంద్రం స్పష్టంచేసింది.
బోర్డు ఉత్తర్వులతోనే ఇరు రాష్ర్టాల అధికారులు డ్యామ్‌పైకి వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 575 అడుగులకు చేరుకున్న నేపథ్యంలో, పర్యవేక్షణ కోసం గ్యాలరీ, డ్యామ్‌పైకి వెళ్లేందుకు అనుమతివ్వాలని తెలంగాణ అధికారులు బోర్డుకు లేఖ రాశారు. పర్యవేక్షణ విధుల్లో మూడు డివిజన్ల అధికారులు షిఫ్ట్‌ల వారీగా పాల్గొంటారని, ప్రతిసారీ ప్రతి ఒక్కరి పేరిట అనుమతులు తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వివరించారు. అంతేకాకుండా, సాగర్ కుడికాలువ హెడ్‌రెగ్యులేటరీ, 13వ నంబర్ వరకు ఉన్న గేట్ల నిర్వహణను సైతం అప్పగించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీకి సైతం డ్యామ్ అధికారులు లేఖ రాసినట్టు తెలుస్తున్నది.