బంజారాహిల్స్/మేడ్చల్, జనవరి 22: హైదరాబాద్ జూబ్లీహిల్స్ గేటెడ్ కమ్యూనిటీ సముదాయంలో నివాసముంటున్న సీఎంవో కార్యదర్శి, మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఈ నెల 19న అక్రమంగా చొరబడిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ తహసీల్దార్ చెరుకు ఆనంద్‌కుమార్‌రెడ్డి, అతని స్నేహితుడు బాబును పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం మూడుచింతలపల్లిలో నివాసం ఉంటున్న ఆనంద్‌కుమార్‌రెడ్డి గతంలో రెవెన్యూ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఆయన పనితీరు సరిగ్గా లేకపోవడంతో ఉన్నతాధికారులు ఇటీవల డిప్యుటేషన్‌పై పౌరసరఫరాలశాఖకు పంపించారు. ఈ నెల 19న అర్ధరాత్రి సమయంలో తన స్నేహితుడు బాబుతో కలిసి ఆనంద్‌కుమార్‌రెడ్డి జూబ్లీహిల్స్ రోడ్ నం.10(సి)లోని ప్లజెంట్ వ్యాలీకి వచ్చారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అపాయింట్మెంట్ ఉందని సెక్యూరిటీకి చెప్పి ఇంట్లోకి వెళ్లారు. అప్రమత్తమైన ఆమె గట్టిగా కేకలు వేయడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమేనా ?
పోలీస్లైన్స్ను ఆనుకొని ఐపీఎస్ క్వార్టర్స్‌కు భద్రతగా ఉన్న టీఎస్పీఎస్ సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే స్మితా సబర్వాల్ ఇంట్లోకి వారిద్దరు ప్రవేశించినట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన వారిని గేటు వద్దనే ఆపాల్సిన సిబ్బంది లోపలికి ఎలా అనుమతించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొనే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి అక్రమంగా చొరబడిన ఆనంద్‌కుమార్‌రెడ్డిని మేడ్చల్ కలెక్టర్ హరీశ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ధైర్యంగా ఎదుర్కొన్న..
నాకు అత్యంత బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తంగా వ్యహరించి ధైర్యంగా ప్రాణాలు కాపాడుకొన్నా. మీరు కూడా ఎంతో సురక్షితంగా ఉన్నారని భావించినా తలుపులు/తాళాలు వేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఆపద సమయంలో తక్షణమే డయల్ 100కు కాల్ చేయండి. మన రోజువారీ పోరాటాలతోనే విజయం ఉంటుంది. -ఆదివారం ట్విట్టర్లో స్మితా సబర్వాల్