హైదరాబాద్: పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Banakacherla) విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నెల 16న ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్లపై చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండా ఇచ్చిన విషయం తెలసిందే. ఈ నేపథ్యం బనకచర్ల అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అనుమతులు లేని బనకచర్లపై సీఎంల సమావేశంలో చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొంది. కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదాను అజెండాగా ప్రతిపాదించింది.
ఇప్పటికే కృష్ణాపై పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలతో ఇప్పటికే ఎజెండాను పంపించింది. ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంగళవారం ఉదయం కేంద్రానికి మరో లేఖ రాసింది.
బుధవారం జరుగనున్న సమావేశంలో బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని అందులో స్పష్టం చేసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయని, ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవంటూ పూర్తి వివరాలను లేఖలో ప్రస్తావించింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని ఉటంకించింది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని వెల్లడించింది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పేర్కొంది.