హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రంలోనూ మైనారిటీ గురుకులాలను నెలకొల్పుతామని బీహార్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి జామాఖాన్ తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. వీటి గురించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు వివరిస్తానని చెప్పారు. తెలంగాణలో గురుకులాలను నిర్వహిస్తున్న తీరును అధ్యయనం చేసేందుకు రెండు, మూడు నెలల్లో మరోసారి వస్తానని తెలిపారు. ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జామాఖాన్.. శనివారం రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్అలీతో పాటు మైనారిటీ సంక్షేమశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న వివిధ పథకాల గురించి అడిగి తెలుసుకొన్నారు. బంజారాహిల్స్‌లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న షాదీముబారక్, సబ్సిడీ రుణాలు, గురుకుల విద్య తదితర అంశాలతోపాటు సాధిస్తున్న ఫలితాలపై మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, సొసైటీ కార్యదర్శి షఫీఉల్లా ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఉన్నతికి రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకులాలాల్లో 1.31 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిషు మీడియంలో చదువుకొంటున్నట్టు వివరించారు. గురుకుల విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారని, అమెరికాలోని నాసా కేంద్రాన్ని కూడా సందర్శించారని చెప్పారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు.