కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 24 : అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను సెల్లార్ గుంత మింగేసింది. ఈ ఘటన గ్రేటర్ హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా.. కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లో ని ఆర్టీఏ కార్యాలయ సమీపంలో నివాసం ఉండే సంగీత, రమ్య, సోఫి యా, నేహా, నవ్యలు స్నేహితులు. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో వీరంతా మధ్యాహ్నం ఆడుకోవడానికి వెళ్లారు. ఓ సంస్థ భారీ నిర్మాణం కోసం తవ్విన సెల్లార్ గుంత సమీపంలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సంగీత (12) నీటి గుంతలోకి దిగింది. ప్రమాదశాత్తు నీటిలో మునిగిపోతుండగా కాపాడటం కోసం రమ్య (7) నీటిలో పడిపోయింది. ఆమెను కాపాడేందుకు సోఫియా (10) ప్రయత్నించి ఆమెకూడా అందులోనే పడిపోయిం ది. ఈ ముగ్గురిని కాపాడేందుకు నేహా ప్రయత్నించగా అం దులో పడిపోతుండగా గడ్డిపొరక సాయంతో బయటపడింది. ఆ ముగ్గురు నీటిలో కనిపించకపోవడంతో భయం తో నేహా, నవ్యలు బయటికొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ కిషన్‌కుమార్, జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవికుమార్, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో ఆ ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో ఇదే గుంతలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు.