హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : విద్యాసంస్థల్లో ర్యాగింగ్, డ్రగ్స్‌ను నివారించేందుకు పది రోజుల్లోపు టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో తెస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం ప్రకటించారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని జేఎన్ఏఎఫ్ఏయూ ఆడిటోరియంలో డ్రగ్, ర్యాగింగ్ నియంత్రణపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యాంటి నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ డ్రగ్స్‌పై 871267111 1 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీజీపీ డాక్టర్ జితేందర్,ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్ పాల్గొన్నారు.
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యం ఏర్పాటుచేసుకొని.. ఆ దిశగా ముందుకుసాగాలని డీజీపీ జితేందర్ సూచించారు. తానూ ప్రభుత్వ పాఠశాలలోనే చదివి డీజీపీ స్థాయికి ఎదిగినట్టు తెలిపారు. గురుకులాల్లో ప్రవేశం పొందిన 68మంది నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులను శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో అక్షయ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీజీపీ జితేందర్ సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థి దశ ఎంతో అమూల్యమైందని, ఈ సమయంలో చెడుఅలవాట్లకు దూరంగా ఉంటూ లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో అక్షయ విద్య స్థాపకుడు వరప్రసాద్, సలహాదారు, ఐజీ ఎం రమేశ్, ఇండియా సీఎస్ఆర్ హెడ్ మిచెల్లే డొమినికా, ఫౌండేషన్ స్థాపక ట్రస్టీ జనార్దన్, అకడమిక్ అడ్వైజర్ అరుంధతి, హైకోర్టు న్యాయవాది శ్రీనివాస్చౌహాన్ పాల్గొన్నారు.