ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటు ప్రధాన సూచీగా నిలుస్తుంది. అంతటి విశేష ప్రాధాన్యమున్న తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దేశానికే రోల్మాడల్ అని బీజేపీ భజన బృందం పదే పదే చెప్తున్న గుజరాత్ ఈ జాబితాలో 11 స్థానానికి పరిమితవగా.. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ అట్టడుగు స్థానంలో నిలిచింది.
హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యంతోనైతే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామో.. ఆ లక్ష్యం దిశగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. కేంద్రం ఏకాణా ఇయ్యకున్నా స్వీయ శక్తితో ముందుకు సాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రం నలుదికులకూ వికేంద్రీకరిస్తూ తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. 2014-15 నుంచి తలసరి ఆదాయాన్ని ఏటేటా గణనీయంగా మెరుగుపరుచుకుంటున్న తెలంగాణ.. ఈ రంగంలో తనకు సాటిలేదని మరోసారి రుజువు చేసుకున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ తలసరి ఆదాయ గణాంకాల్లో తెలంగాణ ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో నిలిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు ఏకంగా రూ.3,17,115కి ఎగబాకింది. అంటే, గత తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 156 శాతం (రూ.1,93,001) వృద్ధి చెందింది. ఇదే సమయంలో దేశ తలసరి ఆదాయం 98 శాతం వృద్ధితో రూ.86,647 నుంచి రూ.1,72,000కు పెరిగింది. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 84.36 శాతం (రూ.1,45,115) ఎక్కువ.
అగ్రస్థానంలో తెలంగాణ
కేంద్ర పాలిత ప్రాంతమైన గోవాను మినహాయిస్తే తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హర్యానా, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర ఉన్నాయి. దేశానికే రోల్మాడల్గా బీజేపీ పదేపదే చెప్తున్న గుజరాత్ 11వ స్థానంలో నిలువగా.. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ర్టాల కంటే అట్టడుగున ఉన్నది.
ఈ ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నా తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణే మొదటి స్థానంలో ఉన్నది. 2022-23లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.41,672 పెరిగింది. ఇది తెలంగాణ చరిత్రలోనే ఆల్టైమ్ రికార్డు. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం రూ.21,993 మాత్రమే పెరిగింది. ఇలా చూసినా తెలంగాణ కంటే జాతీయ తలసరి ఆదాయం దాదాపు 50% తక్కువే.