హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఇంధన పరిరక్షణ రంగంలో తెలంగాణకు మరో జాతీయ అవార్డు వరించింది. గ్రూప్ 2లోని రాష్ట్రాల్లో తెలంగాణకు నిర్దేశిత సంస్థగా ఉన్న తెలంగాణ పునరుత్పాధక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడో) సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నది. జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ నీలం జానయ్య, ఎనర్జీ కన్జర్వేషన్ పీడీ శ్రీనివాసులు అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గించేందుకు సంస్థలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్‌ను మున్సిపల్ యాక్ట్‌లో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందని చెప్పారు. తెలంగాణ రెడ్కోకు జాతీయ అవార్డు దక్కడంపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తాను చైర్మన్‌గా పనిచేసిన కాలానికి వరుసగా రెండుసార్లు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు దక్కిందని గుర్తుచేశారు.