ఖైరతాబాద్, మే 30 : పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నీలి విప్లవం సృష్టించారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుర్రాల మల్లేశం ముదిరాజ్ తెలిపారు. ముదిరాజ్‌లకు కేసీఆర్ పాలన స్వర్ణయుగమని, మత్స్యకారుల సంక్షేమాని కి కేసీఆర్ పెద్దపీట వేశారని కొనియాడారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, జిల్లా అధ్యక్షులు, చీఫ్ప్రమోటర్స్తో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలెల్ల బోయిన అశోద్ ముదిరాజ్తో కలిసి మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు గడ్డుకాలం మొదలైందని తెలిపారు. మత్స్యసహకార సంఘాలను కేసీఆర్ బలోపేతం చేశారని, 33 జిల్లాలవారీగా సహకార సంఘాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్ హ యాంలో ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరలో రూ.20 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసిందని మండిపడ్డారు. 1,025 నమోదిత ప్రాథమి క మత్స్య సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభు త్వం పట్టించుకోవడంలేదని తెలిపారు.
కేసీఆర్ హయాంలో ఉచిత చేపపిల్లల పం పిణీ కార్యక్రమంతో లక్షలాది మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరిందని ముదిరాజ్ మహాసభ నేతలు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో వానాకాలం ప్రారంభమైనా చేపపిల్లల ఉచిత పంపిణీకి కనీసం టెండర్లు కూడా పిలువకపోవడం సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నదని మండిపడ్డారు.