హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధపోరాట రథసారథి రావి నారాయణరెడ్డి స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందని, ఆ లక్ష్యాన్ని సాధించామని బీఆర్ఎస్ సీనియర్‌నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ అమరవీరుల సార్మకట్రస్ట్ ఆధ్వర్యంలో రావి నారాయణరెడ్డి 118వ జయంతి వేడుకల్లో వినోద్‌కుమార్ పాల్గొన్నారు. మతోన్మాద శక్తులు విజృభిస్తున్న ప్రస్తుత తరుణంలో 140 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 75 కోట్లమంది 25 ఏళ్లలోపు యువతే ఉందని, అలాంటి వారికి మార్గదర్శనం చేయడమే నారాయణరెడ్డి లాంటి మహానాయకులకు నిజమైన నివాళి అవుతుందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో సాయుధపోరాటం అసాధ్యమని, ఈ విషయాన్ని మావోయిస్టులు గ్రహించాలని సూచించారు.
కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ రావి నారాయణరెడ్డి కమ్యూనిస్టు యోధుడు మాత్రమే కాదని, మానవత్వం మూర్తీభవించిన గొప్ప గాంధేయవాది అని అన్నారు. తనకున్న 500 ఎకరాల భూమి పేదలకు పంచడం ద్వారా భూదాన ఉద్యమానికే స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని గుర్తుచేశారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా భూకేంద్రీకరణ బద్దలైందని, కానీ పేదలకు భూమి అనే లక్ష్యం అసంపూర్తిగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ నాడు ఊరి బయట ఉన్న దళితులను రావి నారాయణరెడ్డి ఊరి లోపలికి తీసుకొస్తే, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను తిరిగి ఊరి బయటకు పంపిస్తున్నదని విమర్శించారు.
సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. రావి నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి కందిమళ్ల ప్రతాపరెడ్డి సభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్‌లో రావి నారాయణరెడ్డి విగ్రహాం ఏర్పాటు చేయాలని, ఎల్బీనగర్ ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త దవాఖానకు రావి నారాయణరెడ్డి పేరు పెట్టాలని తీర్మానించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరామ్, ట్రస్ట్ సభ్యులు పాశం యాదగిరి, పల్లా వెంకటరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, రావి ప్రతిభ, ట్రస్ట్ కోశాధికారి రత్నాకర్‌రావు పాల్గొన్నారు.