రాష్ట్రంలో డిజిటలైజేషన్ వేగవంతం
మరింత మెరుగ్గా పౌరసేవలు: కేటీఆర్
తెలంగాణతో పనిచేయడం సంతోషకరం
మాస్టర్‌కార్డ్ వైస్‌చైర్మన్ మైఖేల్ ఫ్రోమాన్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో డిజిటలైజేషన్‌ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్‌కార్డ్‌తో భాగస్వామి కానున్నది. దావోస్‌లో జరుగుతున్న డబ్ల్యూఈఎఫ్ సమావేశాల సందర్భంగా గురువారం పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, మాస్టర్ కార్డ్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్ సమక్షంలో ఈ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకొన్నారు. డిజిటలైజేషన్ ద్వారా పౌరసేవలను వేగవంతం చేసేందుకు ఈ ఒప్పదం దోహదపడుతుందని.. చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. పంపిణీ, వ్యవసాయ సైప్లె చెయిన్ డిజిటలీకరణ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ లిటరసీ తదితర ప్రాధాన్య రంగాల్లో మాస్టర్‌కార్డ్ రాష్ర్టానికి సహకరిస్తుంది.
డిజిటల్ తెలంగాణ విజన్‌లో ప్రపంచస్థాయి సంస్థలు భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉన్నదని కేటీఆర్ పేర్కొన్నారు. పౌరసేవలు మరింత మెరుగుపడటమే కాకుండా ఆర్థిక అక్షరాస్యత, సంక్షేమ పథకాల పంపిణీ, చెల్లింపుల్లో ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మాస్టర్‌కార్డ్ ప్రపంచం సమగ్రమైన, సుస్థిరాభివృద్ధి సాధించడంలో సహకరించడానికి కట్టుబడి ఉన్నదని మైఖేల్ ఫ్రోమాన్ పేర్కొన్నారు. తమ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.