హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు యూకే పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు లాంగ్లిస్టులో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే జాబితాలో నాగరాజు పేరు ఉన్నది. వందల మంది దరఖాస్తు చేస్తే ముగ్గురు నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో నాగరాజు ఒకరుగా ఉన్నారు. లాంగ్లిస్టులోని వ్యక్తులు అధికారిక పోటీదారులు.
పార్టీ ఎంపికల్లో ఒకరిపై మరొకరు పోటీ పడతారు. చివరికి అందులో ఒకరు బరిలో నిలుస్తారు. ఆ వ్యక్తే పార్టీ అధికారిక పార్లమెంటరీ అభ్యర్థిగా ఎంపికవుతారు. అంతర్జాతీయ వక్తగా నాగరాజుకు పేరున్నది. వర్సిటీలు, అంతర్జాతీయ సంస్థల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ఈయన సమీప బంధువు.