హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఇకడి సాహిత్య సాంస్కృతిక వికాసం మునుపెన్నడూ లేనివిధంగా విస్తృతంగా వెలుగులోకి వచ్చింది. సామాజిక మార్పు కోసం పోరాడిన సాంస్కృతిక యోధుల చరిత్రలను పాఠ్యపుస్తకాలలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు, తెలంగాణ భాష గొప్పదనాన్ని, సౌందర్యాన్ని తెలియజేస్తూ సిలబస్సులో చేర్చా రు. తెలంగాణ కథ, పాట, నవల, కళలు, సం స్కృతి వైభవోపేతమైన స్థానం పొందాయి. ఈ ఘనత ప్రభుత్వంచొరవతోనే సాధ్యమైంది.
సాహిత్యాన్ని ప్రోత్సహించింది కేసీఆరే
వలస పీడన పాలనలో మగ్గి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక మరుగునపడిపోయిన మన సాహిత్యం వికసించింది. స్వయంగా కవి, రచయిత, నిత్య అధ్యయనశీలి అయిన సీఎం కేసీఆర్ 2014కు ముందు మూతపడిన సాహిత్య అకాడమీని పునరుద్ధరించారు. చరిత్రలో నిలిచిన సాహితీమూర్తులను గుర్తిస్తూ.. వారి రచనలకు విస్తృత గుర్తింపు తెచ్చారు.
తెలంగాణ ఓ సాహితీ వనం: జూలూరు
తెలంగాణ నేలంతా సాహితీ సౌరభాలు వెల్లివిరుస్తున్నాయని, సీఎం కేసీఆర్ ఆదేశానుసారం మన సమస్త కళలు, సాహిత్యాన్ని రికార్డు చేసే మహత్తర బాధ్యతను సాహిత్య అకాడమీ చేపట్టిందని అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఇది మన తెలంగాణ సాహిత్య ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలు
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ 9 ఏండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా సాహిత్య దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.