హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ)ను ప్రొత్సహించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసింది. హైదరాబాద్‌ను ఈవీ లైట్‌హౌజ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమైంది. టీఎస్ రెడ్కో, నీతి ఆయోగ్, బ్రిటన్ ప్రభుత్వాలు సంయుక్తంగా ‘రోడ్‌మ్యాప్ ఫర్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ హైదరాబాద్ టూ ఏ గ్లోబల్ ఈవీ లైట్‌హౌజ్ సిటీ’ని రూపొందించాయి. ఈ నివేదికను బ్రిటన్ క్యాబినెట్ మంత్రి నైజెల్ ఆడమ్స్, తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మలు శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 2030నాటికి రూ.30,360 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 1.2 లక్షల ఉద్యోగాల కల్పన, కర్బన ఉద్ఘారాలను 45.84 మెట్రిక్ టన్నులు తగ్గించడమే లక్ష్యంగా ఈ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు.
టీఎస్ఈవీ పోర్టల్ ఆవిష్కరణ..
ఈవీలపై వినియోగదారులకు అవగాహన కల్పించడం, వాటి ప్రయోజనాలను వివరించేందుకుగాను టీఎస్ఈవీ వెబ్‌పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాలసీలు, నిబంధనలు, సమీప చార్జింగ్ స్టేషన్లు తదితర సమాచారం ఉంటుంది. టీఎస్ రెడ్కో వీసీ,ఎండీ ఎం జానయ్య, బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.