హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): గ్రామీణ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉన్నదని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తంచేశారు. గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది అని, రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలని సూచించారు. తెలంగాణలో పీఎంజీఎస్‌వై పనులు, పీఎం ఆవాస్ సర్వేను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై సోమవారం మంత్రి శివరాజ్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి 27 రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ రహదారి పనులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని చెప్పారు.
జూలై 1 నుంచి వికసిత్ భారత్ గ్రామీణ యోజన అమలు చేస్తున్నామని, నిధుల వాటా సమయానికి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్రం ప్రతిపాదించిన నూతన ‘వీబీజీ రామ్ జీ’ చట్టం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపేలా, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక అడ్డుచెప్పారు. కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 2న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరమే ‘వీబీజీ రామ్ జీ’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై కేంద్రానికి అధికారికంగా తుది నిర్ణయం తెలుపుతామని స్పష్టంచేశారు. తెలంగాణలోని ఐదో షెడ్యూల్డ్ (గిరిజన) ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని సీతక్క కోరారు. ఇందిరమ్మ ఇండ్లు, వ్యక్తిగత భూ అభివృద్ధి పనులను కూడా ఇందులో చేర్చాలని చెప్పారు. రెండేండ్ల క్రితమే తెలంగాణ పీఎంఆవాస్ యోజన సర్వే పూర్తి చేసి పంపినా ఇండ్లు మంజూరు చేయలేదని, వెంటనే ఆమోదం తెలుపాలని కోరారు.