నందిపేట్/ఖలీల్‌వాడి, జనవరి 30: ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలకు పుట్టినిల్లు తెలంగాణ అని, ప్రతిఒక్కరూ సనాతన ధర్మం కోసం కృషి చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమంలో కొనసాగుతున్న 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ సభలకు సోమవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుతో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్సీ కవిత కలశాభిషేకం, అన్నప్రసాద పూజలో పాల్గొని అయోధ్య నుంచి వచ్చిన పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం సాధుపరిషత్ సమావేశంలో పాల్గొని హంపి పీఠాధిపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమానికి నలుమూలల నుంచి సాధుపుంగవులు రావడం, జిల్లా ప్రజలందరికీ వారి ఆశీస్సులు దొరకడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి శివుని విగ్రహానికి అభిషేకం చేశారు.
615 మంది స్కూల్ అసిస్టెంట్లకు స్పౌజ్ బదిలీలు కల్పించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు స్పౌజ్ ఫోరం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కేదారేశ్వర ఆశ్రమానికి సోమవారం వచ్చిన ఎమ్మెల్సీని వారు కలిశారు.