హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమానికి, విత్తనరంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మకమైన పథకాలు ఆదర్శనీయమని టర్కీ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ యల్మాన్ ఒకాన్ అభిప్రాయపడ్డారు. విత్తన రంగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉన్నదని, రాష్ట్రంలో తయారయ్యే విత్తనాలకు అంతర్జాతీయంగా ఎంతో విలువ ఉన్నదని చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు, విత్తన సంస్థ ఎండీ డాక్టర్ కేశవులుతో సమావేశమయ్యారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నదని కొనియాడారు. టర్కీ కంపెనీలు, ట్రేడర్స్‌తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి విత్తన రంగంలో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. విత్తన రంగంపై పరస్పర సహకారాన్ని కాంక్షిస్తూ.. తెలంగాణతో సంబంధాలను మెరుగుపరుచుకుంటామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో సహకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు ఒకాన్కు వివరించారు.