నమస్తే తెలంగాణ నెట్వర్క్: దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పలువురు టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ నాయకులు కోరారు. కేంద్రంలోని ప్రజా, రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, మోదీని ఢీకొట్టే సత్తా దేశంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ శనివారం పలుచోట్ల టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్లు, దళితబంధు, కల్యాణలక్ష్మి/ షాదీముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతోపాటు సాగునీటి ప్రాజెక్టులను అనతి కాలంలోనే పూర్తిచేసి దేశానికి మార్గదర్శిగా నిలిచిందని చెప్పారు.
తెలంగాణకు హరితహారంతో పచ్చని రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఇలా అనేక రంగాల్లో రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే సత్తా కేసీఆర్‌కే ఉన్నదని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గణేశ్ చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు వరంగల్ జడ్పీ చైర్పర్సన్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో 300 మంది పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలను చూసిన ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, వైస్‌చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లేపు శోభ పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు కోసం, బంగారు భారతావని నిర్మాణం కోసం, మతోన్మాద శక్తులను కూకటివేళ్లతో సహా తొలగించాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని విద్యార్థి లోకం తరఫున కోరుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రామగళ్ల సుందర్, జిల్లా నాగయ్య, శోభన్‌బాబు, ప్రశాంత్, రవి, నరేశ్, రమేశ్, రాజ్‌కుమార్, విజయ్, వేణు, సంపత్ పాల్గొన్నారు.
బైక్ ర్యాలీలు.. పటాకుల మోత
దేశానికే తెలంగాణను మాడల్‌గా తీర్చిదిద్దిన బహుముఖ ప్రజ్ఞాశాలి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించడంతోపాటు పటాకులు కాల్చి, సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ దేశ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, యావత్ తెలంగాణ ఆయన వెంట నడుస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, ప్రభాకర్, నళినికిరణ్, నేతలు ముప్పిడి మధుకర్, శ్రీకాంత్, రాజుసింగ్, సురేశ్‌యాదవ్, విజయ్, శ్రీధర్, నర్సింగ్‌రావు, అజయ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలో కొత్త నాయకత్వం రావాల్సిందే
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా దేశం అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. వ్యవసాయం, నీటి పారుదల, విద్య, వైద్యం రవాణా, పరిశ్రమలు, దేశవిదేశీ వ్యవహారాలు, రైతాంగ సమస్యలు, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల సమైక్యత, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అడుగంటిపోయాయి. దీనికి తోడు ఎల్ఐసీ, రైల్వే, బ్యాంకింగ్, విద్యుత్తు, బొగ్గు మొదలైనవాటిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సమకాలిన రాజకీయ వ్యవస్థ మార్పుతోపాటు దేశ అభివృద్ధి కోసం కొత్త నాయకత్వం అవసరం. అకుంఠిత దీక్ష, సాధించాలనే పట్టుదల కలిగిన కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– మేడి రామనర్సయ్య, నీటి పారుదలశాఖ రిటైర్డ్ ఉద్యోగి, 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు, ఆత్మకూరు(ఎం), యాదాద్రి భువనగిరి జిల్లా
మీటర్లు పెడతమన్న బీజేపీ వద్దు

కేసీఆర్‌లాంటి నాయకుడు దేశ రాజకీయల్లో ఉంటేనే రైతులంతా బాగుపడ్తరు. తెలంగాణ వచ్చినంక రైతుల కష్టాలు మొత్తం పోయినయ్. కరెంటు బాధలేకుంటైంది. పెట్టుబడికి ఢోకాలేకుంట చేసిన్రు. నాకు ఐదెకరాల భూమి ఉన్నది. రైతుల కోసం కేసీఆర్ ఇన్ని పథకాలు ఇస్తుంటే బీజేపోళ్లు మాత్రం పండించిన పంటను కూడా కొంటలేరు. ఇది చాలదన్నట్టు పొలాల కాడ మోటర్లకు మీటర్లు పెడుతమని అంటున్నరు. అలాంటోళ్లు ఉంటే ఎంత! లేకపోతే ఎంత! కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలన్నీ దేశం మొత్తం అమలు కావాల్నంటే ఆయన ప్రధాని కావాలే. దేశంలోని రైతులందరికీ రైతుబంధు సాయం అందాలే. రైతు బీమా అమలు కావాలే.
– నస్కూరి కేశవ్, రైతు, లగ్గాం గ్రామం, దహెగాం మండలం
ప్రత్యామ్నాయం కేసీఆరే..
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కేసీఆరే. దక్షిణాది నుంచి దేశ్‌కీ నేతగా మారబోతుండటం శుభ పరిణామం. మతాల పేరిట దేశంలో చిచ్చుపెట్టే పాలకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేయవచ్చు. తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలుంటాయి. దేశంలోని రైతులకు మంచిరోజులు వస్తాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ప్రధాని అయితే ప్రపంచ దేశాల్లో భారత్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దవచ్చు. ఉత్తర, దక్షిణ ప్రాంతాలు అనుసంధానం చేసి, దేశంలో వృథా పోతున్న వేలాది టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
– సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు
అన్ని రంగాలపై అవగాహన ఉన్న నేత
సీఎం కేసీఆర్‌కు అన్ని రంగాలపై పూర్తి అవగాహన ఉన్నది. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తెలంగాణకు స్వరాష్ట్రంలో అనేక అంతర్జాతీయ పరిశ్రమలను తీసుకొచ్చి నేడు అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధికోసం వెంపర్లాడుతున్నది. సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేయడం లేదు. ఇటువంటి పరిస్థితిలో దేశ రాజకీయాల్లోకి అన్ని అర్హతలు ఉన్న కేసీఆర్ అరంగేట్రం చేస్తుండటం నిజంగా శుభపరిణామం.
– కీత రామారావు, విశ్రాంత ఉద్యోగి, కీతవారిగూడెం, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా
శుభపరిణామం..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం శుభపరిణామం. తెలంగాణ పథకాలు అద్భుతం. ప్రస్తుతం దేశంలో అభివృద్ధిపైన కాకుండా విభజన రాజకీయాలు నడుస్తున్నాయి. జీఎస్టీ, నిత్యావసరాల పెరుగుదల, పెట్రో, డీజిల్, గ్యాస్ రేటు పెరగడంతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఓడిపోతామనే భయం పట్టుకున్నది. అందుకే ఉత్తరాదిని వదిలి దక్షిణాది జపం చేస్తున్నది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ సక్సెస్ అవుతారని భావిస్తున్నాం. లౌకికవాదులకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.
-ఖాలేఖ్, సీపీఐ మెదక్ జిల్లా కార్యదర్శి
జాతీయ పార్టీకి ఇదే అదును..
కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించేందుకు ఇదే అదును. ప్రస్తుతం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ పార్టీ నేత మాట్లాడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు నేనున్నా అని సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. నాన్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఇతర పార్టీలతో కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. బీజేపీ పాలనలో వ్యాపార రంగాలు కుదేలయ్యాయి. దేశ సమైక్యత వర్ధిల్లాలంటే, అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి చెందాలంటే కేసీఆరే సరైన వ్యక్తి. వ్యవసాయ రంగం కోలుకొనేలా చేసే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉన్నది.
– గొడవర్తి శ్రీనివాసరావు, ఖమ్మం వర్తకసంఘం ప్రధాన కార్యదర్శి
రైతుల బతుకులు మారుతయి
కేసీఆర్ సారు జాతీయ పార్టీని తప్పక పెట్టాలె. సారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల దేశంలోని రైతులందరి బతుకులు మారుతాయి. ఇక్కడ ఇస్తున్న పథకాలు దేశంలో అమలు చేసే సత్తా మన సీఎం సారుకే ఉన్నది. సీఎం సారు జాతీయ పార్టీ పెడుతున్నట్టు టీవీలు, పేపర్లలో వార్తలు చూస్తున్నాం. సారు పెట్టే పార్టీతో దేశంలో అన్ని రకాల ప్రజలకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా రైతు కుటుంబాల్లో వెలుగులు నిండుతయి.
-అంగోత్ శ్రీనునాయక్, రైతు, బోర్లం క్యాంపుతండా, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా
కేసీఆర్ ప్రధాని కావాలి
కేసీఆర్ సారు ప్రధానమంత్రి అయితే దేశం ఇంకా మంచిగా అయితది. బీజేపీ అచ్చినంక మోదీ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుండు.. కేసీఆర్ సారు ఏమో అంతా మంచిగ జేసుకుంటా పోతుంటే.. మోదీ అమ్మేస్తూపోతుండు. కేసీఆర్ సారు వచ్చినంకనే తెలంగాణ డెవలప్ అయితున్నది. యాడ చూసినా డబుల్ బెడ్డ్రూం ఇండ్లు కట్టిస్తుండు.
– మమత గృహిణి, కోటగిరి, నిజామాబాద్ జిల్లా