హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సర్కార్ వెనక్కి తగ్గింది. కొత్త విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు విలీనాన్ని అధ్యాపక సంఘాలు, ప్రైవేట్ జూనియర్ కా లేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి.
ఈ విద్యాసంవత్సరం ఇంటర్ ప్రవేశాలను యథావిధిగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోర్డు విలీన అంశంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ కే రామకృష్ణారావు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్‌రాజ్, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణాలతో విలీన సమస్యలు, తదనంతర పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రవేశాలకు తక్కువ సమయం, సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నట్టు గుర్తించారు.
విలీన ప్రక్రియపై భాగస్వాములతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకెళ్లాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు నియమించిన కేకే కమిటీ దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఆ తర్వాత కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై లెక్చరర్ల సంఘం నేతలు మధుసూదన్‌రెడ్డి, సురేశ్, టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీశ్ హర్షం వ్యక్తంచేశారు.