(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : రేవంత్ పాలనలో తెలంగాణ పారిశ్రామిక ప్రభ మసకబారిపోతున్నది. కేసీఆర్ హయాంలో దేశానికి ఏ కొత్త కంపెనీ వచ్చినా ముందుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. పెట్టుబడిదారుల్లో నమ్మకం పూర్తిగా సడలిపోయింది. వెరసి బీఆర్‌ఎస్‌పాలనలో కంపెనీల ఏర్పాటులో, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడంలో, సులభతర వాణిజ్యంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు 13వ స్థానానికి పడిపోయింది.
పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మించడంలో తెలంగాణ వెనుకబడి ఉన్నట్టు నీతిఆయోగ్ తాజా నివేదికను బట్టి అర్థమవుతున్నది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ క్యాటగిరీలో 47.3 స్కోర్‌తో రాష్ట్రం 13వ ర్యాంకుకు పరిమితమైనట్టు నీతిఆయోగ్ వెల్లడించింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన టీజీఐపాస్ పాలసీని ఒకవైపు ప్రశంసించిన నీతిఆయోగ్.. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణంలేదని తేల్చిచెప్పింది. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్తగా ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే ఆర్థికంగా పెనుభారంగా మారిందని, కంపెనీ సెటప్‌కు కూడా ఎక్కువ సమయం వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొన్నదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఎడాపెడా విధిస్తున్న పన్నులతో రాష్ట్రంలో వాహనరంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్‌రేటు పెట్టుబడిదారుల్లో భయాన్ని కలిగిస్తున్నట్టు అభిప్రాయపడింది. మొత్తంగా స్నేహపూర్వక పెట్టుబడుల వాతావరణాన్ని కల్పించడంలో మిగతా రాష్ర్టాలతో పోలిస్తే, తెలంగాణ మరింత మెరుగైన ప్రగతి సాధించాల్సిన అవసరం ఉన్నదని నీతిఆయోగ్ తేల్చిచెప్పింది. మౌలిక సదుపాయాల కల్పన, వాణిజ్య వాతావరణం, వనరులు, ప్రభుత్వ పాలసీలు, నిబంధనల సరళీకృతం, సంస్థాగత సదుపాయాలు, ఆర్థిక సుస్థిరత తదితర విషయాల్లో తెలంగాణ ప్రదర్శన సాధారణంగానే ఉన్నదని, అత్యుత్తమ ప్రదర్శన ఏమీ చూపించడంలేదని పేర్కొంది.

కేసీఆర్ సర్కార్ పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేసే ఉద్దేశంతో 2015లో టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టింది. ఆన్లైన్ ద్వారా ఒకే దరఖాస్తుతో నిర్ణీత గడువులోగా అన్ని రకాల అనుమతులు మంజూరవడమే దీని ప్రత్యేకత. 2014-15 నుంచి 2025-26 వరకూ టీఎస్ఐపాస్ ద్వారా 28,078 పరిశ్రమలకు అనుమతులు మంజూరు కాగా, రూ. 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 19 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. బీఆర్ఎస్ పాలనలోనే అమెజాన్, టీసీఎస్, డెలాయిట్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో, మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి కంపెనీలు అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పా టు చేసుకున్నాయి. నోవార్టీస్, జీఎస్కీ, డాక్టర్. రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో, హెటిరో వంటి ఔషధ కంపెనీలు, అల్పాలాన్, బ్యాండ్రోన్, బెండిట్ వంటి లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు చేపట్టాయి. ఔషధ కంపెనీలకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీని కేసీఆర్ సర్కార్ గణనీయంగా విస్తరించడమే కాకుండా వైద్య పరికరాల కోసం సుల్తాన్‌పూర్‌లో ప్రత్యేకంగా మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేసింది. యంగ్వన్, కిటెక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ బిజినెస్‌లో పలుమార్లు దేశంలోనే నంబర్ 1 ర్యాంకులో నిలిచింది.
కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు స్వర్గధామంగా మారిన తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. ఈ విషయాన్ని కప్పిపెట్టిన రేవంత్ సర్కార్.. ఒప్పందాలు లక్షల కోట్ల స్థాయిలో ఉన్నట్టు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి రెండేండ్లలో రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వం ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ సదస్సు సందర్భంగా ప్రకటించింది. డిసెంబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య టీజీఐఐసీ ద్వారా 998 యూనిట్లకు భూములు కేటాయించగా, ఆ యూనిట్లు పెడుతున్న పెట్టుబడులు రూ. 88,534 కోట్లని తాజాగా ప్రభు త్వం విడుదల చేసిన సోషియో ఎకనమిక్ ఔట్లుక్-2026 ద్వారా బయటపడింది. అంటే, ఇప్పటివరకు జరిగిన ఒప్పందాల్లో పదిశాతం వరకు కంపెనీలు మాత్రమే ప్రారంభించేందుకు ముందుకొచ్చినట్టు అర్థమవుతున్నది.

సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొన్న ఏకపక్ష నిర్ణయాలే పెట్టుబడులపై తీవ్రమైన ప్ర భావాన్ని చూపించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పారిశ్రామిక వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చిం ది. దాదాపు అన్ని అనుమతులు వచ్చి.. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న 16 వేల ఎకరాల ఫార్మాసిటీని రద్దు చేయడమేంటని పారిశ్రామికవర్గాలు ఆశ్చర్యం వ్యక్తంచేశాయి. అనంతరం, హైడ్రా పేరి ట కూల్చివేతలు చేపట్టడం రియల్ఎస్టేట్ రంగాన్ని కుదేలయ్యేలా చేసింది. ఇది కూడా కొత్త పెట్టుబడులకు ప్రతిబంధకం గా మారింది. పెరుగుతున్న క్రైమ్ రేటు, ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం కారణంగా తెలంగాణలో కంపెనీల స్థాపనకు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే కార్నింగ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్, కేన్స్ సెమికాన్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి దిగ్గజ కంపెనీలు ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లినట్టు అభిప్రాయపడుతున్నారు.
