భూదాన్ పోచంపల్లి మే 21 : 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భారతీయ చేనేత హైదరాబాద్ ముత్యాలతో తెలంగాణ ఇకత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్ చరిత్రాత్మక అరంగేట్రం చేశారు. ప్రపంచ రెడ్ కార్పెట్‌పై భారతీయ సాంస్కృతిక రాయబారిగా ఆమె ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ మాస్టర్ నేతలు నేసిన పోచంపల్లి ఇకత్ కుచర్ దుస్తులను ఠాకూర్ ప్రదర్శించారు. పోచంపల్లి టు కేన్స్ థీమ్‌తో తెలంగాణ మగ్గాల నుంచి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం వరకు మన జీఐ ట్యాగ్ చేనేతను తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా రష్మీఠాకూర్ మాట్లాడుతూ.. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లానని చెప్పారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇకత్ వస్త్రాలతో రెడ్ కార్పెట్‌పై నడిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 200 ఏండ్ల చరిత్రను తమ దారాల్లో పొదిగిన పోచంపల్లి నేతన్నల అద్భుత సృష్టి ఇకత్ వస్త్రాల కళావైభవాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే అవకాశం రావడం గొప్ప విషయమని చెప్పారు. ప్రత్యేక వస్త్రాలను అందించిన పోచంపల్లి ప్రొడ్యూసర్, సీఈవో తడక రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.