Telangana IB Officer | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో తెలంగాణలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) విభాగంలోని కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మనీశ్ రంజన్ మృతిచెందారు. ఇటీవల ఫ్యామిలీతో కశ్మీర్ టూర్ వెళ్లిన ఆయన్ను.. ముష్కరులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఐడీ చూసి మరీ ‘నువ్వు ఐబీ ఆఫీసర్‌వు కదూ.. నిజం చెప్పు’ అంటూ పాయింట్ బ్లాంక్‌లో కాల్చారని విశ్వసనీయ సమాచారం. కాగా, ఆధార్ కార్డు చూసి హైదరాబాద్ వాసిగా నిర్ధారించారు. మృతుడు మనీశ్ రంజన్‌ది బీహార్. భార్య, ఇద్దరు పిల్లలతో ఎల్టీసీపై టూర్‌కు వెళ్లారు. కాగా, కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే వారిని దూరంగా పరిగెత్తమని మనీశ్ కోరినట్లు తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్‌లోని ఐబీ ఆఫీసులో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్‌గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.