హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అవయవదానంలో రాష్ట్రం మరోసారి ఆదర్శంగా నిలిచింది. జీవన్ దాన్ కార్యక్రమానికి రెండు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ‘నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్’ శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేసింది. గత ఏడాది కాలంలో అత్యధికంగా అవయవ దానం, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
ఈ నేపథ్యంలో కేంద్రం ఉత్తమ రాష్ట్ర అవార్డును ప్రకటించింది. దీంతోపాటు అవయవదాన రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకుగానూ జీవన్‌దాన్ కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ స్వర్ణలతను ‘ఉమెన్ పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్’ అవార్డు వరించింది. ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పాటిల్, నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ కే పాల్ చేతుల మీదుగా జీవన్‌దాన్ కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ స్వర్ణలత అవార్డును స్వీకరించారు.
జీవన్ దాన్ కార్యక్రమం కింద 2023 మార్చి నుంచి ఈ ఏడాది జూలై వరకు 303 మంది నుంచి అవయవాలను సేకరించినట్టు వైద్యశాఖ తెలిపింది. వాటిని మొత్తం 1150 మందికి అవయవమార్పిడి చేసినట్టు వెల్లడించింది. ఇందులో కిడ్నీ 457, కాలేయం 273, గుండె 30, ఊపిరితిత్తులు 118, పిత్తాశయం 2, కార్నియా 270 సర్జరీలు ఉన్నట్టు పేర్కొంది.