హైదరాబాద్, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ ) : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబరు 13న ఎన్ఐఏ కోర్టు వెలువరించిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఐదుగురు దోషులు వేర్వేరుగా దాఖలు చేసుకున్న క్రిమినల్ అప్పీల్ పిటిషన్లను ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. చట్టప్రకారం కింది కోర్టు ఎవరికైనా ఉరిశిక్ష విధిస్తే, ఆ వ్యక్తులు అప్పీలు చేసినా చేయకపోయినా ఉరిశిక్ష విధింపు తీర్పును హైకోర్టు ధ్రువీకరించాల్సి ఉంటుంది. దీంతో ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు నుంచి వచ్చిన నివేదనను (రెఫర్డ్ అప్పీల్‌ను) హైకోర్టు ఆమోదిస్తూ జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధలతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒకేసారి ఐదుగురు దోషులకు ఉరిశిక్షను ఖరారు చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని దోషులు ఉగ్రదాడికి పాల్పడ్డారని, ఇది వ్యక్తులపైనే కాకుండా సభ్య సమాజంపై జరిగిన దాడి అని హైకోర్టు పేర్కొన్నది. పిల్లలు, ఆడవాళ్లు అనే కనికరం లేకుండా బాంబు దాడులకు పాల్పడటం అసాధారణ నేరమని వ్యాఖ్యానించింది. ఓ మహిళ, ఆమె గర్భంలో ఉన్న శిశువు సహా 18 మందిని పొట్టనబెట్టుకున్న దోషులకు ఉరిశిక్ష విధించడం సరైనదేనని స్పష్టం చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భతల్ పరారీలో ఉన్నాడు. మిగిలిన ఐదుగురు దోషులైన అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది అలియాస్ తబ్రెజ్ అలియాస్ డేనియల్ అలియాస్ అసద్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ జావేద్ అలియాస్ అహ్మద్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, మహమ్మద్ అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భతల్ అలియాస్ షారుఖ్, ఇజాజ్ షేక్ అలియాస్ సమర్ అర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఇజాజ్ సయ్యద్ షేక్‌లకు ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షను హైకోర్టు సమర్ధించింది.
హైదరాబాద్ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 2న రాత్రి 7 గంటల సమయంలో తొలి బాంబు పేలుడు జరిగింది. 107 నంబర్ బస్టాప్ వద్ద ఈ పేలుడు జరిగిన కొద్ది క్షణాలకే కోణార్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మరణించగా, మరో 131 మంది గాయపడ్డారు. ఒక మహిళతోపాటు ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ కుక్కర్లలో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఎన్ఐఏ తేల్చింది. కేసు దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భతల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లో భారత్-నేపాల్ సరిహద్దు సమీపాన అరెస్ట్ చేసింది. విచారణలో వాళ్లిద్దరూ చెప్పిన సమాచారం ఆధారంగా బీహార్‌కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్‌కు చెందిన జియా ఉర్ రెహమాన్‌ను 2014 మేలో ఢిల్లీ పోలీసులు రాజస్థాన్‌లో అరెస్ట్ చేయగా.. పుణెకి చెందిన అజీజ్ షేక్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ను దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు కీలక సూత్రధారిగా గుర్తించారు. కర్ణాటకలోకి భక్తల్కు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు తేలడంతో రెడ్‌కార్నర్ నోటీసు జారీచేసిన ఎన్ఐఏ.. మొత్తం ఆరుగురు నిందితులపై ప్రత్యేక కోర్టులో 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ భత్కల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015 నుంచి విచారణ ప్రారంభమైంది. భద్రతా కారణాల దృష్ట్యా చర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి సుమారు రెండేళ్లపాటు ఎన్ఐఏ కోర్టు విచారణ జరిపింది. అందులో భాగంగా 157 మంది సాక్షులను విచారించి, 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చింది. వారికి 2016 డిసెంబర్ 19న ఉరి శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. అనంతరం తన తీర్పును ధ్రువీకరణ నిమిత్తం హైకోర్టుకు నివేదించింది. ఇదే సమయంలో ముద్దాయిలు ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్రిమినల్ అప్పీళ్లను దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ అప్పీళ్లను హైకోర్టు డిస్మిస్ చేసి, ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్ధించింది. అభం, శుభం తెలియని అమాయక ప్రజలు ప్రాణాలు తీసిన ముద్దాయిలు ఉరి శిక్షకు అర్హులేనని తేల్చుతూ సంచలన తీర్పును వెలువరించింది. ప్రస్తుతం ఆ దోషులంతా జైళ్లల్లో ఉన్నారు. పాక్‌లో శిక్షణ.. నేపాల్ మీదుగా భారత్‌కు పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిక్షణ పొందిన రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, జియావుర్ రెహమాన్ నేపాల్ మీదుగా భారత్‌లో అడుగుపెట్టారు.
నేపాల్‌లో ఉన్న మహ్మద్ తహసీన్ అక్తర్ వెంట తీసుకుని బీహార్‌లోని సమస్థీపూర్లో దాక్కున్న యాసిన్ భతల్ వద్దకు చేరుకున్నారు. అనంతరం వారంతా కలిసి ఢిల్లీ, వారణాసి, ముంబై, పుణె తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాల్పడ్డారు. 2012లో రియాజ్ భతల్ ఆదేశాల మేరకు అసదుల్లా అక్తర్, జియావుర్ రెహమాన్ బెల్గాం నుంచి మంగళూరు చేరుకున్నారు. వారికి హవాలా మార్గం ద్వారా రూ.లక్ష పంపిన రియాజ్ భత్కల్.. 2013 జనవరిలో మంగళూరులో పేలుడు పదార్థాలు అందుతాయని, వాటితో హైదరాబాద్‌లో పేలుళ్లు జరపాలని ఆదేశించాడు. దీంతో మహ్మద్ తహసీన్ అక్తర్ హైదరాబాద్‌కు వచ్చి అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. 2013 ఫిబ్రవరి 9న డానిష్ పేరుతో అసదుల్లా అక్తర్ టికెట్ బుక్ చేసుకుని మంగళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకోగా.. ఇతర నిందితులు 2013 ఫిబ్రవరి 16న పేలుడు పదార్థాలతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముందే హైదరాబాద్‌లో పరీక్షలు కుకర్‌లో పేలుడు పదార్థాలు సంఘటనకు రెండు రోజుల ముందు ఆ కిరాతకులు అబ్దుల్లాపూర్‌మెట్‌కు 5-6 కి.మీ. దూరంలో పేలుళ్ల పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్లో కుకర్ కొనుగోలు చేసి, పేలుడు పదార్థాలు నింపారు. సైకిళ్ల రిపేరు చేసే వ్యక్తి నుంచి పాత సైకిలు కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాలు నింపిన కుక్కర్లను సైకిళ్లపై అమర్చి బస్టాప్, మిర్చి సెంటర్ వదిలి వెళ్లారు. ఫిబ్రవరి 21న బెంగళూరు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ కుట్రలో కీలకపాత్ర పోషించిన ఇజాజ్ షేక్ ఉగ్రవాదులకు నకిలీ గుర్తింపు కార్డులను తయారు చేయడంలో దిట్ట. అందుకు ఇజాజ్ షేక్ ఉపయోగించిన 19 ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర హైకోర్టు సమర్థించడంపై పేలుళ్ల బాధితులు, స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంగళవారం స్వీట్లు పంచుకుని సంబురాలు పంచుకున్నారు. నాటి ఘటన పీడకలలా ఇప్పటికీ తమను వెంటాడుతున్నదని వారు పేర్కొన్నారు. నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లకుండా, వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. పేలుళ్ల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తాను రూ.5 లక్షల వరకు నష్టపోయానని స్థానిక హోటల్ యజమాని పాండురెడ్డి వాపోయారు. గోకుల్‌చాట్, లుంబినిపార్క్, దిల్సుఖ్నగర్ సహా అన్ని ఘటనల వెనుక యాసిన్ భత్కల్ ఉన్నాడని, అతన్ని వెంటనే ఉరితీయాలని గోకుల్‌చాట్ ఘటన బాధితుడు రహీమ్ డిమాండ్ చేశారు. పేలుళ్ల బాధితులకు సర్కారు ఆర్థికసాయం చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు.