హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మహిళా ఉద్యోగులకు మూడో బిడ్డ ప్రసవానికి ప్రసూతి సెలవు వర్తిస్తుందో లేదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రసూతి సెలవు 180 రోజులను రెండుసార్లకే పరిమితం చేస్తూ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2010లో జీవో 152 జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జీ శ్వేత పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మూడో బిడ్డ ప్రసవానికి అనుమతించేందుకు చేసుకున్న దరఖాస్తుపై పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిందని, రెండు ప్రసవాలకే సెలవు పరిమితిని ఎత్తివేసిందని చెప్పారు. ప్రభుత్వ వివరణ నిమిత్తం తదుపరి విచారణ ఈనెల 16న జరుగనుంది.