హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తీరు పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇస్తేనే అధికారులు పనిచేస్తున్నారని మండిపడింది. ప్రజల ఫిర్యాదులను అధికారులు పరిషరించడం లేదంటూ ఎంతోమంది కోర్టులకు వస్తున్నారని తెలిపింది. ఆ తర్వాత కోర్టులు ఆదేశించినా అమ లు చేసే తీరిక అధికారులకు ఉన్నట్టు లేదని మండిపడింది.
తమవద్దనే కోర్టుధికరణ కేసులు 110 వరకు ఉన్నాయంటే అధికారుల పనితీరు ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థమవుతున్నదని ఘాటుగా వ్యాఖ్యానించింది. తీర్పు అమలు చేయలేనిపక్షంలో అందుకు కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చే సి కోర్టు నుంచి అనుమతి పొందాలని హితవు చెప్పింది. సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లాన ర్లు, డిప్యూటీ కమిషనర్లు మీటింగ్ నిర్వహించి ఒక నిర్ణయానికి వస్తే కేసులు వీగిపోవని, రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి వాళ్ల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్ సూచనలు పొందాలని సూచించింది.
టోలిచౌకీలో దుకాణం ముందు మెట్లను కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ఆరిఫ్అబ్దుల్సర్దార్ టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ జరిపారు. గతంలో ఆదేశించిన మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ కే ఇలంబరితి స్వయంగా హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కమిషనర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జీహెచ్ఎం సీ అధికారులు ఉన్నది ఆస్తి పన్ను వసూలుకు మాత్రమేనన్న భావన ప్రజల్లో రానివ్వొద్దు. రోజురోజుకు మీపై వారిలో విశ్వాసం కోల్పోకుండా చూసుకోం డి. కోర్టులకు రావాల్సిన పరిస్థితులు తెచ్చుకోవద్దు. ’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. టోలీచౌకి నిర్మాణంపై జనవరి 22 లోగా నివేదిక ఇవ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. విచారణను జనవరి 22కు వాయిదా వేశారు.