హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం తమ చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందో లేదో, ఎవరికైనా ఎగవేసిందో లేదో తెలుసుకునేందుకు వీలుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. దీనిపై బాగా ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని తెలిపింది. ఇందుకు అయ్యే ఖర్చులను మార్గదర్శి వెచ్చించాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను తదుపరి విచారణ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్ల సేకరణ చట్ట వ్యతిరేకమంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను అక్టోబర్ ఒకటికి వాయిదా వేసింది.