హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : లైంగికదాడి బాధితులైన మహిళలకు రక్షణ కల్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఇంకెంత సమయం కావాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు నెలలుగా కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లైంగికదాడి కేసుల్లో దోషిగా తేలిన వ్యక్తికి శిక్ష పడిన మూడు నెలల్లోగా బాధితురాలికి అతని ఆస్తి నుంచి 50 శాతం పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రానికి, నెల రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ జీ రాధారాణి ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణలో మహిళలపై నేరాలు పెరగడానికి కారణాలు, వైఫల్యాలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ)ను ఆదేశించాలని ఆయన కోరారు. వాదనల తర్వాత కేంద్రానికి నోటీసులు జారీ చేసి విచారణను వచ్చే నెల 4కు హైకోర్టు వాయిదా వేసింది.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఆగ్రోస్‌కు చెందిన భూములు గత పదేండ్లలో ఎక్కడా కబ్జా కాలేదని ఆ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజు, ఎండీ రాములు వెల్లడించారు. ఆగ్రోస్ భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, సదరు భూములను పరిరక్షించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆగ్రోస్ భూములను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలరాజు మాట్లాడుతూ.. ఆగ్రోస్ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా 590 ఎకరాల భూములు ఉండగా.. అత్యధికంగా బెల్లంపల్లిలో 543, మౌలాలీలో 23, చింతల్లో 10 ఎకరాలు ఉన్నట్టు వెల్లడించారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మౌలాలోని 3 ఎకరాలు కబ్జాకు గురైనట్టు వివరించారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు. చింతల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని భూములను లీజుకు ఇచ్చామని, కొందరు ఆ భూములను వినియోగించడం లేదని, మరికొంతమంది అద్దె చెల్లించడం లేదని పేర్కొన్నారు. వారికి నోటీసులు జారీ చేశామని, త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎండీ రాములు మాట్లాడుతూ.. భూములను సర్వే చేయిస్తున్నామని, వాటిని అభివృద్ధి చేసి గోదాములు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.