హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పోలవరం ముంపుపై సంయుక్త సర్వే చేయాల్సిందేనని తెలంగాణ మరోసారి స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో 150 అడుగుల వరకు నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో 800 ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపింది. గతనెల 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం జరిగింది. ఈ సమావేశ ముసాయిదా మినిట్స్‌ను ఇటీవలే విడుదల చేయగా, వీటిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాము లేవనెత్తిన అంశాలు ముసాయిదాలో సరిగ్గా చేర్చలేదని, తగిన మార్పులు చేయాలని కోరుతూ పీపీఏ సీఈవోకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్‌రావు లేఖ రాశారు. వరదల సమయంలో పోలవరంలో నీరు నిల్వ ఉంటే గోదావరి 35 ఉపనదుల ప్రవాహం సజావుగా ఉండదని, దీనివల్ల 40 వేల ఎకరాలకు పైగా నీటమునుగుతాయని చెప్పారు. గతేడాది నవంబరు 10వ తేదీన ఏపీ అధికారుల బృందం పోలవరం ముంపు ప్రాంతాలను పరిశీలించి 892 ఎకరాలు నీట మునుగుతాయని గుర్తించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వచ్చిన వరదలతో పోలవరంలో 1272 అడుగుల వరకు నీటిని నిల్వ చేశారని ఈఎన్సీ గుర్తుచేశారు