ముషీరాబాద్, ఫిబ్రవరి 21 : ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమని సీపీఐ (ఎంఎల్ )మాస్‌లైన్ ఆల్ ఇండియా పార్టీ కేంద్ర బ్యూరో సభ్యుడు కేజీ రామచంద్ర విమర్శించారు. బీజేపీ ఫాసిస్టు, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకంగా లౌకికవాద ప్రజాస్వామ్య ఫెడరలిజం కోసం ఈ నెల 28న సదస్సు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. విద్యా నగర్‌లోని మార్క్స్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాస్‌లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కే రమ, ఎస్ఎల్ పద్మ, హన్మేష, సదానందంతో కలిసి ఆయన మాట్లాడారు.
‘సబ్ కా వికాస్, సబ్ కా సాత్’ అని ప్రధాని మోదీ ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ దేశంలో కార్పొరేట్ వికాస్ జరుగుతున్నదని విమర్శించారు. పేద, ధనిక వర్గాల మధ్య అసమానతలు మరింత పెరిగిపోయాయని, ప్రజల జీవనప్రమాణాలు క్షీణించాయని ఆరోపించారు. కార్పొరేట్ వర్గాలకు రాయితీలిస్తూ, పేదలను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.