Uttam Kumar Reddy | హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తెల్లరేషన్‌కార్డు లబ్ధిదారులకు వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తామని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడీఎస్ బియ్యం దారితప్పితే చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. పట్టుబడితే తక్షణమే డీలర్షిప్ రద్దు చేస్తామని తెలిపారు. రేషన్ డీలర్ల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తున్నామని, వారి న్యాయమైన డి మాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,6 29 రేషన్ డీలర్ల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కార్యదర్శి డీఎస్ చవాన్ ఇతర 8 శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నెల్లికల్లు ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతికి భూసేకరణ అడ్డుకావద్దని, రైతులతో త్వరితగతిన సంప్రదింపులు జరపాలని సూచించారు. నెల్లికల్లు లిఫ్ట్ పనులపై ఈఎన్సీ అనిల్‌కుమార్, నల్లగొండ కలెక్టర్ నారాయణరెడ్డి, సీఈ అజయ్‌కుమార్‌తో సచివాలయంలో గురువారం జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. అటవీశాఖ భూములకు అదనంగా చెల్లించాల్సిన నిధుల ప్రతిపాదనలను రూపొందించాని, పెండింగ్‌లో ఉన్న 23 కోట్ల విద్యుత్తు బకాయిలతోపాటు పెరిగిన బకాయిల ప్రతిపాదనలు తక్షణమే పంపాలని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా నిర్మించతలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణానికి పాలనా పరమైన అనుమతులు తీసుకోవడంతోపాటు 5 చెక్ డ్యామ్‌లకు తక్షణమే టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి పాల్గొన్నారు.