Telangana | హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలోనే సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ అయిన టైగర్ బీర్లు రాబోతున్నట్టు సమాచారం. టైగర్ బ్రాండ్‌తో ఉన్న బీర్లు సింగపూర్‌లో చాలా ఫేమస్. రాష్ట్రంలో ఇటీవల కాలంలో యూబీ గ్రూప్‌నకు చెందిన కింగ్‌ఫిషర్ సహా వివిధ బ్రాండ్ల కంపెనీలు రాష్ట్రప్రభుత్వ తీరుపై విసుగెత్తి తాము తెలంగాణకు బీర్ల సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కింగ్‌ఫిషర్ వంటి బ్రాండ్ల స్థానంలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అనేక ప్రతిపాదనలు వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో కొత్త బ్రాండ్లను తీసుకొచ్చే అంశంపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.
తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్ వెళ్తున్నందున ప్రధానంగా టైగర్ బీర్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. టైగర్ బ్రాండ్ బీర్లు తెలంగాణకు వస్తే భారీ ఎత్తున అమ్మకాలు ఉంటాయని, ప్రభుత్వం వారినే ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుందని మద్యం వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
టైగర్ బ్రాండ్ బీర్లు రాష్ట్ర మార్కెట్‌ను ముంచెత్తడం ఖాయమని చెప్తున్నారు. ఆ కంపెనీ భారీ ఎత్తున తాయిలాలను కూడా రిటైలర్లకు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. టైగర్ బ్రాండ్‌ను రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు పెద్దఎత్తున లాబీయింగ్ కూడా జరుగుతున్నట్టు సమాచారం.