హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): చాలాకాలంగా ఎదురుచూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. దీనిపై సీఎస్ నేతృత్వంలో కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇది ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త అని కేసీఆర్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మూసి నది, ఈసా నదులు.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలు కలుషితం కాకుండా, గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ, మాస్టర్‌ప్లాన్‌ను అమలుచేసే జీవోను అమలుచేయాలని ఆదేశించామన్నారు.
సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా రెండు జలాశయాల పరిరక్షణ కోసం నియమ నిబంధనలపై ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ రెండు జలాశయాలలోనూ, మూసీ, ఈసా నదులలోనూ కాలుష్య జలాలు చేరడానికి వీలులేకుండా కొత్త జీవోను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆమోదం ద్వారా రూపొందించాలని ఆదేశించారు.
కలుషితం కాకుండా చర్యలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 111 జీవో కారణంగా అభివృద్ధి విస్తరణకు, వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతున్నదని క్యాబినెట్ అభిప్రాయపడింది. హైదరాబాద్ తాగునీటి అవసరాలు, గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వీటి క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేయకూడదని గతంలో 111 జీవో అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం నగర తాగునీటి అవసరాలు ఈ రెండు జలాశయాలపై ఆధారపడిలేవు. కృష్ణా, గోదావరి జలాల ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్న నేపథ్యంలో 111 జీవో అవసరం లేకుండాపోయింది. దీంతోపాటు ప్రజల విన్నపాలను పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం జీవోను రద్దుచేయాలని నిర్ణయించింది. అదే సమయంలో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిరక్షణ విషయంలోనూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని క్యాబినెట్ నిర్ణయించింది.
వీటిని కాళేశ్వరం జలాలతో అనుసంధానంచేసే పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ జలాశయాలద్వారా నీటి సరఫరాకోసం ఉన్న వ్యవస్థను రాజధానిలో పచ్చదనం పెంపొందింపజేసేందుకు వినియోగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూసీ సుందరీకరణ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో.. మూసీలోకి ఈ జలాశయాల ద్వారా నీటిని వదలడానికి తగిన పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. 11 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మురుగునీటి పారుదల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని, ఇతర పథకాలను రూపొందించాలని సీఎం ఆదేశించారు.
కొత్తగా మూడు మున్సిపాలిటీలు
ఆదివాసి, గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించాలనే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఎన్నో ఏండ్ల కల.. కేసీఆర్‌తో జల
సీఎంకు విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు
మంచిర్యాల : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఎన్నో ఏండ్ల కల నెరవేరనున్నది. ఎత్తిపోతలకు రూ.1,658 కోట్ల నిధులు మంజూరు చేయడంతో సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నో ఏండ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవులు అనుభవించారే తప్ప ప్రజల దాహార్తిని, రైతుల సాగునీటి కష్టాలను తీర్చలేదు.
కాంగ్రెస్ హయాంలో మాజీ ఎంపీ వెంకటస్వామి కుటుంబమే చెన్నూర్ నియోజకవర్గంలో పదవులను అనుభవించింది. అంతకముందు 20 ఏండ్లు బోడ జనార్దన్ ఎమ్మెల్యేగా చేశారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో వివేక్ ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా బాల్క సుమన్ ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే నీటి పారుదలశాఖ మంత్రి చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరుపై ప్రకటన చేయడం విశేషం. ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో చెన్నూర్, భీమారం, కోటపల్లి, జైపూర్, మందమర్రి తదితర గ్రామాల ప్రజలు, రైతులు మంగళవారం పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకొన్నారు.