హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : డిసెంబర్ 3న నిర్వహించనున్న బోర్డు మీటింగ్‌ను వాయిదా వేయాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ సర్కారు కోరింది. ఈ మేరకు శుక్రవారం లేఖ రాసింది. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన ఆపరేషన్ రూల్‌కర్వ్, జలవిద్యుదుత్పత్తి తదితర అంశాలపై చర్చించేందుకు తొలుత 8వ తేదీన సమావేశాన్ని నిర్వహించాలని కేఆర్ఎంబీ భావించింది. అయితే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 25వ తేదీ తర్వాత నిర్వహించాలని ఏపీ విజ్ఞప్తి చేయగా కేఆర్ఎంబీ డిసెంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఢిల్లీలో 4వ తేదీ నుంచి ట్రిబ్యునల్ విచారణ కొనసాగనున్నదని, ఈ నేపథ్యంలో మీటింగ్‌ను వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గ్రామపంచాయతీల్లోనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సెర్ప్ సీఈవో దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యానికి గురైన వాళ్లు పింఛన్ తీసుకొనేందుకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.