హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పదో తరగతి ప్రశ్నపత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలుంటాయని నిర్ణయించింది. గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం ఆరింటికి కుదించింది. నిరుడు కరోనా నేపథ్యంలో 30 శాతం సిలబస్‌ను తగ్గించి, 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహించారు. ఈసారి మాత్రం వందశాతం సిలబస్‌కు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. 80 మారులకు వార్షిక పరీక్షలు, 20 మారులకు ఇంటర్నల్స్ ఉంటాయి. ఈ ఆరు పేపర్ల విధానాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు అధికారులు ఆలోచిస్తున్నారు.
సైన్స్‌లో మాత్రం రెండు…
పదో తరగతి పరీక్షలో అన్ని సబ్జెక్టులకు ఒకే సమాధాన పత్రాన్ని ఇస్తారు. కానీ, ఒక సైన్స్ పేపర్‌కు మాత్రం రెండు జవాబు పత్రాలిస్తారు. మొదట భౌతిక రసాయన శాస్త్రం పేపర్‌కు జవాబులు రాశాక, చివరి గంటన్నర సమయంలో జీవశాస్త్రం పేపర్‌కు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గతంలో తెలుగు, హిందీ రెండో భాషగా ఉండేవి. నిరుడు నుంచి ఉర్దూను కూడా ఇందులో చేర్చారు. మొదటి భాషగా తెలుగు లేదా హిందీ తీసుకొంటే విద్యార్థి రెండోభాషగా ఉర్దూ ఎంచుకోవచ్చు. ఉర్దూ ప్రథమ భాషగా ఉంటే తెలుగు లేదా హిందీ ద్వితీయభాషగా తీసుకోవచ్చు.
