కరీంనగర్ కలెక్టరేట్, మే 17: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టంచేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యో గుల సమస్యలపై పోరాడేందుకు ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించిన అనంతరమే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులపై ప్రభుత్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసి 8 నెలలు గడిచినా ఇప్పటివరకు తమతో చర్చించకపోవడంతో ఐకాస ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించినట్టు తెలిపారు. వెంటనే స్పందించిన సీఎం.. ఐఏఎస్ అధికారులతో నవీన్ మిట్టల్ కమి టీ ఏర్పాటుచేసి తమతో 2 ధఫాలుగా చర్చలు జరిపినట్టు వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెం డింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల హామీ మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులకు నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం మానుకోవాలని సూచించారు. ఐఏఎస్‌ల కమిటీ మరోసారి చర్చలు జరిపి సానుకూల నివేదిక అందజేస్తుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్మించుకున్న భవనాలకు చెల్లించాల్సిన పన్నులు మినహాయిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వసూ ళ్లు చేస్తుండటం సహేతుకం కాదని తెలిపారు.