Anganwadi | హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం కోసం ఉద్దేశించిన అంగన్వాడీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని టీచర్లు మండిపడుతున్నారు. అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లు, వర్కర్లను, ఉద్యోగ విరమణ పొందిన వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను అటకెక్కించారని మండిపడుతున్నారు.
గత జూన్‌లో ఉద్యోగ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఇంతవరకు అందించలేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాకు రూ.1 లక్ష వరకు ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ విషయం మర్చిపోయారని విమర్శిస్తున్నారు. ఈ అంశంలో జీవో జారీ చేయకుండా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నదని, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో దాదాపు 12 వేలలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం భవన యజమానులకు ఎప్పటికప్పుడు అద్దె చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలుగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయమై అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందచేశారు. భవనాల యజమానులు బకాయిల కోసం టీచర్లను నిలదీస్తున్నారు. సామాన్లు బయట పడేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్రాలకు తాళాలు వేస్తామని బెదిరిస్తున్నారు. సర్కారు వెంటనే అద్దె బకాయిలు విడుదల చేయాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో నిధులు లేక గర్భిణులు, బాలింతలకు పాల పంపిణీ సరిగా జరగడం లేదు. కొందరు కాంట్రాక్టర్లు రెండు నెలలకోసారి పంపిణీ చేయాల్సిన టెట్రా ప్యాక్ పాలను మూడు నెలలైనా అందించడం లేదు. తమకు సకాలంలో పాల సరఫరా బిల్లులు అందడంలేదని, అందువల్ల సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సంబంధితశాఖ మంత్రి, అధికారులు దృష్టి సారించాలని, పాల కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.