Solar Power Pumps | తెలంగాణలోని గిరిజన రైతులకు నిరంతరం సాగు నీరు అందించేందుకు వీలుగా పీఎం కుసుమ్ కింద లక్ష సౌర పంపులు కేటాయించాలని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి కుసుమ్ -సీ ఎఫ్ఎల్ఎస్ కాంపొనెంట్ కింద 2,500 మెగావాట్లను కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యుత్ సరఫరా, నెట్వర్క్ బలోపేతానికి రూ.488 కోట్ల అంచనా వ్యయంతో తొమ్మిది ప్రాజెక్టు నివేదికలను కేంద్రానికి సమర్పించామని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీం (ఆర్డీఎస్ఎస్)లో తెలంగాణ డిస్కమ్‌లను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ (ఆర్ఈసీ) ఇచ్చిన రుణాలకు వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.
కొత్త పునరుత్పత్తి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి రెండు సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని.. అందువల్ల ఆర్‌పీపీవో లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు విధించే జరిమానాలు మాఫీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. పునరుత్పత్తి విద్యుత్ నిర్వహణ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌కు అవసరమయ్యే నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్, శ్రీనివాస రాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.