హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలిసింది. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, డీపీహెచ్ రవీందర్ నాయక్ మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు పెరుగుతున్నాయని చర్చ జరుగుతున్నది. క్రిస్టినా జడ్ చొంగ్తు ఘాటుగా మాట్లాడుతుంటారని మొదటి నుంచీ ఫిర్యాదులు ఉన్నాయి. రవీందర్ నాయక్ వ్యవహార శైలిపైనా సిబ్బంది తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. తాజాగా జరిగిన ఓ సంఘటనతో ఇది తీవ్రమై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గరికి పంచాయితీ చేరినట్టు సమాచారం. రాష్ట్రంలోని బ్లడ్‌బ్యాంకుల పనితీరుపై మంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
మంత్రి దగ్గరికి వెళ్లే ముందు హెచ్వోడీలు హెల్త్ సెక్రటరీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె బ్లడ్‌బ్యాంకుల పనితీరుపై డీపీహెచ్‌ను అడగ్గా, తన వద్ద సమాచారం లేదని, ప్రిపేర్ అయి రాలేదని చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ప్రిపేర్ అయి రాకుండా రివ్యూకు ఎందుకు వచ్చారని కసురుకున్నట్టు సమాచారం. మంత్రి దగ్గరికి రావాల్సిన అవసరం లేదని ముఖం మీదే చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అందరిముందే ఇదంతా జరగటంతో రవీందర్ నాయక్ నేరుగా మంత్రి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఏ అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నారో ముందుగా చెప్పలేదని, పైగా తన పరిధిలో బ్లడ్‌బ్యాంకులు లేవని చెప్పినట్టు తెలిసింది. గతంలోనూ పలుమార్లు తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బ్లడ్‌బ్యాంకులపై మంత్రి సమీక్షలోనూ ఆయన పాల్గొనలేదని తెలిసింది. దీనిపై మంత్రి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. ఏ అంశాలపై సమీక్ష చేసేది.. ముందస్తుగానే డీపీహెచ్ కార్యాలయానికి సమాచారం అందించామని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య విబేధాలు ఇంకెంత ముదురుతాయోనని వైద్యశాఖలో చర్చ జరుగుతున్నది.