హైద రాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి- బనకచర్ల ప్రాజెక్టులపై చర్చించాల్సిందేనని తెలంగాణ డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సరారు తాజాగా లేఖ రాసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు పోలవరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఏర్పడుతున్న ముంపు ప్రభావం అంశాలపై చర్చించేందుకు పీపీఏ ఈ నెల 27న ఏపీ, తెలంగాణలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఆ సమావేశంలో చర్చించేందుకు ఎజెండా పంపాలని ఇరు రాష్ట్రాలకు సూచించగా.. తెలంగాణ తాజాగా ఎజెండాను పీపీఏకు పంపింది. అందులో ప్రధానంగా ఏపీ కొత్తగా చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని ప్రతిపాదించింది. ఏపీ సరారు ఎలాంటి అనుమతులు లేకుండా, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా వరద జలాల పేరిట 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్లకు, అటు నుంచి పెన్నా బేసిన్‌కు తరలించేందుకు ఉపక్రమించిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టుతో తెలంగాణ జల హకులకు విఘాతం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించాలని లేఖలో తెలిపింది. పోలవరం విస్తరణ పనులపై కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని కూడా సమావేశ ఎజెండాలో పొందుపరచాలని కోరింది.