రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట!
రామగండంలో 800 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ నిర్మించే విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో ప్రకటన చేస్తున్నది. రెండున్నరేండ్లుగా ఎటూతేల్చకుండా సందిగ్ధంలో పడినట్టు తెలుస్తున్నది. ప్రతిసారీ ఏదో మెలిక పెడుతుండటంతో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది. మొదట సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పి..
- కొత్త ప్లాంట్ నిర్మాణంపై సర్కార్ మీనమేషాలు
- మొదట సింగరేణి, జెన్కో సంయుక్త ప్రాజెక్ట్‌గా ప్రకటన
- ఆ తర్వాత జెన్కో ద్వారా చేపట్టేందుకు రంగం సిద్ధం
- మళ్లీ ఎన్టీపీసీ పేరిట కొత్త మెలిక
- తాజాగా సింగరేణికి అప్పగించనున్నట్టు మరోసారి ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : రామగండంలో 800 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ నిర్మించే విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో ప్రకటన చేస్తున్నది. రెండున్నరేండ్లుగా ఎటూతేల్చకుండా సందిగ్ధంలో పడినట్టు తెలుస్తున్నది. ప్రతిసారీ ఏదో మెలిక పెడుతుండటంతో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది. మొదట సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పి.. అభ్యంతరాలు రావడంతో సింగరేణిని తప్పించింది. తర్వాత జెన్‌కు అప్పగించేందుకు అంతా సిద్ధం అయిన తర్వాత మళ్లీ వెనుకడుగు వేసి జెన్కోను తప్పించింది. ఇప్పుడు మళ్లీ సింగరేణికే అప్పగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రకటించడం ప్రభుత్వ డోలాయమాన స్థితికి అద్దంపడుతున్నది.
అన్ని వనరులున్నా..
రామగుండంలో జెన్కోకు 62.5 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ ఉండేది. అయితే ఈ ప్లాంట్ 50 ఏండ్ల కిందినాటిది. ప్లాంట్ జీవితకాలం కూడా ముగియడం, మరమ్మతులకు గురవుతుండటంతో ఈ ప్లాంట్‌ను మూసివేశారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ పాత ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించాలని జెన్కో ప్రతిపాదించింది. కానీ జెన్కో ద్వారా నిర్మించే విషయంలో సర్కార్ ఏదీ తేల్చడం లేదు. రామగుండంలో ప్లాంట్ నిర్మాణానికి అన్ని రకాల వనరులున్నాయి. జెన్‌కు స్థలమున్నది. పక్కనే సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొనే అవకాశమున్నది. యాష్‌పాండ్ కూడా అందుబాటులో ఉన్నది. అయినా సర్కార్ జెన్కోకు ఇచ్చేందుకు మొగ్గుచూపడం లేదు.
ప్రతిసారీ కొత్త ప్రతిపాదన
ఈ ప్లాంట్ విషయంలో ప్రతిసారీ సర్కార్ కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నది. ఇప్పటివరకు మూడు ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. మొదట్లో ఈ ప్లాంట్‌ను సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తామని ప్రకటించింది. దీనిని విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు వ్యతిరేకించారు. దీంతో సింగరేణిని తప్పించిన సర్కార్.. జెన్కో ద్వారా చేపడుతామన్నది. ఈ మేరకు జెన్కో ఇంజినీర్లు డీపీఆర్ రూపొందించగా, పర్యావరణ అనుమతుల కోసం అధికారులు అంతా సిద్ధంచేశారు. ఇదే సమయంలో సర్కార్ మరో మెలికపెట్టింది. ప్లాంట్‌ను ఎన్టీపీసీ లేదా జెన్కోకు అప్పగిస్తామని మంత్రివర్గం స్పష్టంచేసింది. నిర్మాణ వ్యయం విషయంలో ఎన్టీపీసీతో పోల్చితే జెన్కోదే తక్కువగా ఉన్నది. ఈ లెక్కన చూసినా జెన్కో అప్పగించాల్సి ఉన్నది. అయినా ఎన్టీపీసీపేరిట సర్కారే సందిగ్ధంలో పడింది. తాజాగామళ్లీ సింగరేణికి ఈ ప్లాంట్ ను అప్పగించనున్నట్టు ప్రకటించింది.
పాత ప్లాంట్ కూల్చివేత ఎప్పుడో?
రామగుండం పాత ప్లాంట్‌ను కూల్చేందుకు జెన్కో ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పరికరాలు, స్క్రాప్‌ను వేలం వేస్తే రూ.80కోట్ల ఆదాయం వచ్చే అవకాశమున్నది. కానీ టెండర్లు ఖరారు కాకపోవడంతో కూల్చివేత ప్రక్రియ ముందుకుసాగడం లేదు. ప్లాంట్‌ను జెన్‌కోకే అప్పగించాలని, ఆలస్యమయ్యేకొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుందని జెన్కో వర్గాలు చెప్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

