Telangana | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సాధారణ డిగ్రీ గురుకులాలతోపాటు అధునాతన కోర్సులతో ప్రత్యేక గురుకుల కాలేజీల ఏర్పాటుకు సైతం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సైనిక్, ఆర్మ్ ఫోర్స్, ఫైన్ ఆర్ట్స్, హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ గురుకుల కాలేజీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా రెండు లా కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండ, రంగారెడ్డి కందుకురులో బీసీ గురుకుల న్యాయ డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఇప్పటికే 16 డిగ్రీ కాలేజీలను మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం మరో 17 బీసీ డిగ్రీ కాలేజీలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా డిగ్రీ కాలేజీల్లో వినూత్న, ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే వికారాబాద్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్, ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులతో బీఏ(హనర్స్), సంగారెడ్డి కాలేజీలో హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులను ప్రవేశపెట్టింది. మరో 13బీసీ గురుకుల గురుకుల కాలేజీల్లో బీఎస్సీ(ఎంపీసీఎస్), బీఎస్సీ(బీజడ్సీ), బీకాం, బీఏ కోర్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక ప్రస్తుతం మిగిలిన 2 గురుకుల డిగ్రీ కాలేజీల్లో న్యాయవిద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా కందుకురులో బీసీ గురుకుల న్యాయ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో బీఏ ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్ఎల్బీ 5 ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఆయా కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా అదనంగా మంజూరైన 17 డిగ్రీ కాలేజీల ద్వారా అదనంగా 16,320 మంది, మొత్తంగా 33 బీసీ డిగ్రీ గురుకులాల ద్వారా 31,680 మంది బీసీ విద్యార్థులకు ప్రపంచస్థాయి ఉన్నత విద్య అందనుంది.