హైదరాబాద్ : సొంతిల్లు ఉండటం ప్రతిఒక్కరి కల. దాన్ని నిజం చేయడం మానస కల. తెలంగాణకు చెందిన 23 ఏళ్ల ఈ సివిల్ ఇంజినీర్ బుధవారం నాడు ఓపాడ్స్, మైక్రో హోమ్స్‌ను ప్రారంభించింది. భారతదేశంలోనే ఈ తరహా మోడల్ మొట్టమొదటిది. 120 చదరపు అడుగుల అంతర్గత విస్తీర్ణంతో ఒక పడకగదితో కూడిన ఓపాడ్స్‌ను లాంచ్ చేసింది. 2 వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ మురుగునీటి పైపును ఉపయోగించి మానస ఈ ఇళ్లను రూపొందించింది. తను రూపొందించిన ఒపాడ్ను హైదరాబాద్‌లోని చెంగిచెర్లలో గల ఆమె బంధువుల ఇంటిలో ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఈ ఓపాడ్‌ను ప్రారంభించారు. మనసా చాలా చురుకైన విద్యార్థి అని తనకిది ప్రారంభ అడుగు మాత్రమేనని కొనియాడారు.
జపాన్, హాంకాంగ్, ఇతర ప్రదేశాల్లో ఉన్న డిజైన్లను పరిశోధించి స్థానిక అవసరాలకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ మైక్రోహోమ్స్ను రూపొందించినట్లు మానస తెలిపింది. ప్రధానంగా నిరుపేదలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, వివిధ రంగాలకు అనుగుణంగా ఉండే 12 వేర్వేరు ప్రయోగాత్మక మొబైల్ హౌసింగ్ నమూనాలు ఉన్నాయి. ఒపాడ్ ఒక పడకగది, వంటగది, హాల్, వాష్‌రూమ్, అల్మారాలతో ఉంటుంది. విద్యుత్, నీరు, డ్రైనేజీ పారుదల సౌకర్యాన్ని కలిగి ఉంది. ట్యూబ్ పైన బాల్కనీ లాంటి లాంజ్ ఏరియా ఉంటుంది. ఒకరికి లేదా ఇద్దరికి ఇది బాగా సరిపోతుంది.
40 నుండి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 సంవత్సరాల జీవితకాలంతో అన్ని వాతావరణాల్లో అనుకూలించే ఇళ్లు అని తెలిపారు. దీని ధర సుమారు 3.5 లక్షల నుండి 5.5 లక్షల వరకు ఉంటుందన్నారు. కోరిన వారికి అభిరుచికి తగ్గట్లు రెండు లేదా మూడు పడకగదులతో కూడిన గృహాలు కూడా అందుబాటులో ఉన్నట్లు మానస తెలిపింది. ఓపాడ్ ఓ సాధారణ ఇల్లులా పనిచేస్తుందని.. రిసార్ట్స్, రెస్టారెంట్లు, మొబైల్ గృహాలు, మొబైల్ క్లినిక్‌లు, గెస్ట్ హౌస్‌లు, గార్డు రూమ్‌లు మొదలైన వాటికి ఉపయోగపడే విధంగా డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది.
మానస స్వస్థలం తెలంగాణ కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ గ్రామం. నిరుపేద కుటుంబం. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి, ఓ చెల్లి ఉన్నారు. మానస బ్యాచ్ ఫర్ గర్ల్స్ కు చెందిన మొదటి బ్యాచ్ విద్యార్థిని. సఖిలో శిక్షణ పొందింది. బెంగళూరులో జరిగిన యునిసెఫ్ సమావేశాల్లోనూ ఆమె సాంఘిక సంక్షేమ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహించింది. 2020లో లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం నుండి బి.టెక్(సివిల్ ఇంజినీరింగ్) పూర్తిచేసింది. పట్టణ మురికివాడలలో ప్రజలు పైకప్పుల కింద ఎలా జీవిస్తారో తనకు తెలుసని.. వర్షం వచ్చినప్పుడు వారు తమ వద్ద ఉన్న ప్రతీది కోల్పోతారంది. పట్టణ ప్రాంతాల్లో దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబాలకు సరసమైన గృహ నిర్మాణానికి పరిష్కార మార్గంగా ఓపాడ్‌ను రూపొందించినట్లు మానస పేర్కొంది.
Hats off to Manasa, swaero of Madikonda SW School and @lpuuniversity who established a startup and designed o-pod, an affordable housing solution for families living below poverty line in urban areas. @anushabharadwaj @Swaeroes4u #swaero pic.twitter.com/g5DbJ0MHax
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) April 7, 2021