తెలుగువారికి రెండు రాష్ర్టాలు కాదు.. మూడు ఉన్నాయని టెక్సాస్‌ను చూస్తే అనిపిస్తున్నది. బీఆర్ఎస్ రజతోత్సవాలు నిర్వహించాలన్న చర్చ జరుగుతున్న సందర్భంలో ఎన్నారైలంతా ఏకగ్రీవంగా సూచించిన నగరం డాలస్. ఓ వైపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, మరోవైపు పార్టీ రజతోత్సవ వేడుకలను చూస్తుంటే నాకు అమెరికాలో ఉన్నట్టు లేదు.. తెలంగాణలోనే ఉన్నట్టున్నది. -కేటీఆర్
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని డాలస్‌లో జరిగిన తెలంగాణ సంబురాలు అంబరాన్నంటాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనరంజకంగా సాగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన ఆ సభకు అమెరికా వ్యాప్తంగా తెలంగాణవాదులు వెల్లువలా తరలివచ్చారు. మొత్తంగా డాలస్ తెలంగాణ సంబురాలు విజయవంతం అయ్యాయి. ఈ సంబురాలు చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పాయి. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ, విదేశాల్లో ఒక భారతీయ ప్రాంతీయ పార్టీ ఇంత భారీ ఎత్తున సభ నిర్వహించడం తొలిసారి కావడం విశేషం. ఈ సభ తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని, బీఆర్ఎస్ విజయవంతమైన ప్రస్థానాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ సంబురాలకు డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో కెపాసిటీకి మించి ఎన్నారైలు (ప్రవాస భారతీయులు) తరలివచ్చారు. బయటే వేలాది మంది వేచి ఉండాల్సి వచ్చింది. అమెరికా దేశంలో నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. డాలస్ బీఆర్ఎస్ సభకు కికిరిసి జనం రావడంతో ఫైర్ కోడ్ యాక్టివేట్ అయి డోర్లు మూసుకున్నాయి. దీంతో మరో వేలాది మందికిపైగా ఎన్నారైలు సభా ప్రాంగణం బయటే ఉండిపోయారు. ఇంతపెద్ద సభ భారత్‌లోని ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ విదేశాల్లో నిర్వహించిన అతిపెద్ద సభగా చరిత్రలో నిలిచిపోయింది.
చరిత్ర సృష్టించిన డాలస్ సభ
భారీ బహిరంగ సభల నిర్వహణలో బీఆర్ఎస్కు ఘన చరిత్ర ఉన్నది. లక్షలాది మందితో ఎల్కతుర్తిలో సభ నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించింది. డాలస్ రజతోత్సవ సభ కోసం కూడా పార్టీ భారీ కసరత్తు చేపట్టింది. నెల రోజుల నుంచే అమెరికా వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అమెరికాలోని 50 రాష్ర్టాలతోపాటు కెనడా, గల్ఫ్ దేశాల నుంచి ఎన్నారై ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని ఎన్నారై సంఘాల నుంచి పార్టీలకతీతంగా ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికాలో ఏ రాజకీయ పార్టీ ఇంత భారీ సభ నిర్వహించలేదు. గతంలో హౌడీ-మోడీ సభ భారత ప్రభుత్వం నిర్వహించింది. అది కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా జరిపారు. భారతదేశంలోని జాతీయ పార్టీలుగానీ, ప్రాంతీయ పార్టీలుగానీ ఇంతపెద్ద సభ దేశం బయట ఇలాంటివి నిర్వహించలేదు. ఒక ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీ పెద్ద సభ నిర్వహించడం అమెరికా చరిత్రలో ప్రథమం. కేటీఆర్ ప్రసంగం వినడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని న్యూజెర్సీ, డెలావేర్, హూస్టన్, టెక్సాస్, కొలంబస్, ఆస్టిన్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిసో, లాస్ ఏంజెల్స్, చికాగో, కెంటకీ వంటి నగరాల నుంచి వేలాది మంది ఎన్నారైలు డాలస్ వచ్చారు. విదేశాల్లో ఇంతటి భారీ బహిరంగసభ ద్వారా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త రికార్డు సృష్టించారు.
మనసు గెలుచుకున్న కేటీఆర్
కేటీఆర్ ప్రసంగం సభకు హాజరైన ప్రతిఒకరి మనసు గెలుచుకున్నది. ఒకనాటి తెలంగాణ కష్టాలను, కన్నీళ్లను, బతుకుచిత్రాన్ని, కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఎగురవేసిన విజయపతాకాన్ని ఆయన వివరించిన తీరును ఆసక్తిగా విన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో రంగం ఏవిధంగా అభివృద్ధి సాధించిందో గణాంకాలతో సహా వివరించడంతో అచ్చెరువొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం, పదేండ్ల బీఆర్ఎస్ ఉజ్వల పాలన, ప్రయాణంలో ఎన్నారైలు పోషించిన పాత్ర గురించి కేటీఆర్ చెప్పిన తీరు వారిని విశేషంగా ఆకట్టుకున్నది.‘మూడేండ్లలో మళ్లీ మనదే అధికారం’.. అన్నప్పుడు సభికుల నుంచి చప్పట్లు, ఈలలతో భారీ స్పందన వచ్చింది. సభాప్రాంగణం చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. 2 గంటలపాటు సాగిన కేటీఆర్ ప్రసంగం ఎన్నారైలను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు వారికి ఉన్నది.. రెండు రాష్ట్రాలు కాదు మూడు రాష్ట్రాలు అని కేటీఆర్ అన్నప్పుడు ఈలలతో ఎన్నారైలు కేరింతలు కొ ట్టారు. టెక్సాస్‌ను మూడో తెలుగు రాష్ట్రంగా, డాలస్‌ను డల్లాసపురంగా కేటీఆర్ ఉచ్ఛరించినప్పుడు చప్పట్లు మారుమోగాయి. తెలుగు విద్యార్థుల ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులపై న్యాయసహాయం అందిస్తామని కేటీఆర్ చెప్పినప్పుడు విద్యార్థులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగంపై కేటీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమ డాక్యుమెంటరీని ప్రదర్శించారు.
ఓ వైపు అమరుల స్థూపం.. మరోవైపు తెలంగాణ తల్లి ప్రతిమ
డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో సభా వేదికను తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. వేదికపై ఓ వైపు అమరవీరుల స్థూపం, మరోవైపు తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటుచేశారు. ఎన్నారైలు వాటికి పుష్పాంజలి ఘటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమూనాను పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి ఘట్టాలతో ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ వేడుకకు హాజరైన సుమా రు 50 మంది బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, నేతలు ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడే ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ల వద్ద నాయకులతో ఎన్నారైలు ఫొటోలు దిగారు.
భారీ ఏర్పాట్లు
డాలస్ సభకు వచ్చిన ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లుచేశారు. 200 మంది వలంటీర్లతో సకల వసతులు కల్పించారు. మరో 20 మంది భద్రతా సిబ్బందితో ఎక్కడా తోపులాట జరుగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూశారు. సీట్ల అరేంజ్మెంట్తోపాటు అందరికీ భోజ న వసతులు కల్పించారు. సభకు వచ్చినవారందరికీ పోతుగల్లు స్వీటుషాపువారు భారత్ నుంచి పంపిన 10 వేల స్వీట్, హాట్ ప్యాకెట్లను అం దించారు. బీఆర్ఎస్ ఎన్నారై యూఎస్ఏ చైర్మన్ మహేశ్ తన్నీరు, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల నేతృత్వంలో ఈ సమావేశాలు ఉత్సాహంగా సాగాయి.
హోరెత్తించిన కళా ప్రదర్శనలు
డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తిపోయింది. డాలస్‌లో నివాసం ఉండే 300-400 మంది మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చారు. పెద్ద బతుకమ్మను మధ్యలో పెట్టి ఆడిపాడారు. కోలాటం ఆడారు. స్థానిక కళాకారులు పలు ప్రదర్శనలు ఇచ్చారు. భారతదేశం నుంచి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, గాయనీ మధుప్రియ బృందాలు పాడిన పాటలు ఎన్నారైలను అలరించాయి. ఉద్యమ పాటలు, కేసీఆర్ పాటలు పాడినప్పుడు చప్ప ట్లు, ఈలలతో సభా ప్రాంగణం హోరెత్తిపోయింది. గోరటి, రసమయి పాటలకు వన్స్‌మోర్ ప్లీజ్ అంటూ సభికులు కదంతొక్కారు. పదం పాడారు. జానపదగేయాలు, చిన్నారుల నృత్యాలు ఎన్నారైలను ఆకట్టుకున్నాయి. జై తెలంగాణ..
జై కేసీఆర్ నినాదాలు
పెప్పర్ ఎరినా సభా ప్రాంగణంలోకి కేటీఆర్ ప్రవేశించినప్పుడు ఒకసారిగా జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు మోరుమోగాయి. తమ ముందుకు వచ్చిన తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్‌కు కరచాలనం ఇవ్వడానికి, ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎన్నారైలు పెద్దఎత్తున పోటీపడ్డారు. భారీ సెక్యూరిటీ ఉన్నా లెకచేయకుండా కేటీఆర్‌ను కలుసుకోవడానికి దూసుకువచ్చారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ జై తెలంగాణ.. అని నినదిస్తూ సభా ప్రాంగణం కేటీఆర్ కలియతిరిగారు. అందరినీ ఆప్యాయతతో పలుకరిస్తూ చిరునవ్వుతో ఓపికగా వారితో ఫొటోలు దిగారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఎన్నారైలు.. కేటీఆర్‌తో ఫొటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు, ఉన్నత విద్యనభ్యసిస్తున్న యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌లో 70శాతం మంది యువత ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.