హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): సర్కారు గల్లా పెట్టె ఫుల్లుగా నింపుకోవాటానికి మరో బీరు పథకాన్ని అమల్లోకి తెస్తున్నది. ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో రాష్ట్రంలో ఇన్స్టంట్ బీర్ కేఫ్‌ల ఏర్పాటుకు కసరత్తు పూర్తిచేసింది. నగరంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో, గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 కిలో మీటర్లకు ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం విదివిధానాలు రూపొందించింది. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కనీసం 100 మైక్రో బ్రూవరీలనైనా ఏర్పాటు చేసే దిశ గా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను నిర్దేశించినట్టు తెలిసింది. మైక్రో బ్రూవరీల లైసెన్స్ ఫీజు ప్రస్తుతం రూ.3 లక్షలు ఉండగా.. దాన్ని రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో ప్రతి 13వేల మందికి ఒకటి చొప్పున కేఫ్ ఏర్పాటు చేసే విధంగా ఎక్సైజ్ నిబంధనలను సవరిస్తున్నట్టు తెలిసింది.
తాజా తాజా బీరు
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు బ్రూవరీలు ఉన్నాయి. ఈ బ్రూవరీల నుంచి ఏటా 6,500 లక్షల బీర్ కేసులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2,500 లక్షల కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై నేరుగా గ్లాసులోకే బీరు వచ్చేస్తుంది. కాగా, నివాస ప్రాంతాల్లో 1,000 లీటర్ల ఫ్రెష్ బీర్‌ను ఉత్పత్తి చేయగలిగి, విక్రయించే సా మర్థ్యం ఉన్నచోట మైక్రో బ్రూవరీలను అనుమితించేలా ని బంధనలు సవరిస్తున్నట్టు తెలుస్తుంది.