DSC candidates : పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థించినా, ఆందోళనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేగాక మున్ముందు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని ప్రతిజ్ఞ చేశారు. తమ కుటుంబసభ్యులు, బంధువులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ప్రచారం చేస్తామని తెలిపారు. స్వయంగా తమ కుటుంబసభ్యులే కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో దిగినా ఓటు వేసేది లేదని తేల్చిచెప్పారు.
‘తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులమైన మేము.. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయకుండా, చదువుకునేందుకు తగిన సమయం ఇవ్వకుండా, మా డిమాండ్లను నెరవేర్చకుండా, నిరుద్యోగులపట్ల మొండి వైఖరి అవలంభిస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోమని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని మా కుటుంబసభ్యులు, బంధువుల్లో కూడా ప్రచారం చేస్తామని ప్రమాణం చేస్తున్నాం’ అని పేర్కొంటూ తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులు ఒక ప్రకటన విడుదల చేశారు.