DGP Jitender : చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, పోలీసులు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలంగాణ డీజీపీ (Telangana DGP) జితేందర్ (Jithender) అన్నారు. పౌరుల భద్రత తమకు ముఖ్యమని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై స్పందించారు. అల్లు అర్జున్ సినీ హీరో అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సమాజంలో శాంతిభద్రతలు ఫరిఢవిల్లాలంటే పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డీజీపీ గుర్తు చేశారు. సినీ ప్రమోషన్ కంటే పౌరుల భద్రత, రక్షణే తమకు ప్రాధాన్యమని స్పష్టంచేశారు. ఇలాంటి ఘటనలు జరగడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందువల్లే ప్రతి జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 20 ఎస్పీ కార్యాలయాలు, మరో 9 కమిషనరేట్లు ఉన్నాయని, ఇప్పటివరకు 27 భరోసా కేంద్రాలను ప్రారంభించినట్లు డీజీపీ చెప్పారు. సినిమాల్లో హీరోలైనా బయట మాత్రం పౌరులేనని అన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా తెలుసుకోవాలని సూచించారు. చట్టానికి లోబడి పోలీసు శాఖ పని చేస్తుందని, తప్పు ఎవరు చేసినా కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు.
పౌరుల రక్షణే తమకు ప్రాధాన్యమని, అల్లు అర్జున్‌కు తాము వ్యతిరేకం కాదని డీజీపీ తెలిపారు. చట్టప్రకారం అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకున్నామని, సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని అన్నారు.